Angad Chandhok : భారత్ (India) లో పలు ఆర్థిక మోసాలు చేసి, అనంతరం అమెరికా (USA) కు పారిపోయి అక్కడ కూడా అక్రమాలకు పాల్పడుతున్న ఆర్థిక నేరగాడు అంగద్ సింగ్ చందోక్ (Angad Singh Chandhok) ను సీబీఐ అధికారులు (CBI officers) అదుపులోకి తీసుకున్నారు. అతడిపై బ్యాంకుల మోసం, మనీలాండరింగ్ కేసులు ఉండటంతో అమెరికా అధికారుల సాయంతో భారత్కు రప్పించి, సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అంగద్ సింగ్ చందోక్ అమెరికాలోనూ పలు మోసాలకు పాల్పడ్డాడు. అంతర్జాతీయ టెక్ సపోర్ట్ పేరుతో మరికొందరితో కలిసి అమెరికాలోని పలువురు వృద్ధులను మోసం చేశాడు. ఈ కేసులో 2022లో అమెరికా కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి ఆరేళ్ల జైలుశిక్ష విధించింది. మరోవైపు కాలిఫోర్నియాలోనూ అతడు మనీలాండరింగ్ నెట్వర్క్ను నిర్వహిస్తున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు.
అతడు పలు షెల్ కంపెనీలను సృష్టించి అమెరికన్ల నుంచి మిలియన్ డాలర్లను ఆన్లైన్ టెక్ సపోర్ట్ స్కీమ్ ద్వారా దోచుకున్నాడని అమెరికా అధికారులు తెలిపారు. అతడితోపాటు అక్రమాలకు పాల్పడిన మరో ఐదుగురిపైనా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గతంలో అతడు భారత్లో కూడా పలువురిని మోసం చేసినట్లు కేసులు ఉండడంతో అమెరికా అధికారుల సాయంతో సీబీఐ అధికారులు అతడిని భారత్కు రప్పించి అరెస్ట్ చేశారు.