న్యూఢిల్లీ: ఇంటర్‌పోల్ తరహాలో భారత్‌పోల్(Bharatpol)ను ఇవాళ భారత ప్రభుత్వం ఆవిష్కరించింది. భారత్‌పోల్ పోర్టల్‌ను ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీ, టెక్నిక్‌ల ద్వారా నేరగాళ్లను పట్టుకునే రీతిలో భారతీయ దర్యాప్తు సంస్థలు మారాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని భారత మండపం సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. భారత్‌పోల్ పోర్టల్‌ను సీబీఐ డెవలప్ చేసిందన్నారు. పోలీసు దర్యాప్తు కేసుల్లో ఇంటర్‌పోల్ సహకారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఇండియాలో నేరానికి పాల్పడి విదేశాలకు పారిపోయే క్రిమినల్స్‌ను పట్టుకునే టెక్నాలజీపై దృష్టిపెట్టాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను గమనిస్తూ.. అంతర్గత వ్యవస్థను పట్టిష్టం చేసుకోవాలన్నారు. దానిలో భాగంగానే భారత్‌పోల్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఇంటర్‌పోల్‌లో ఉన్న 195 సభ్యదేశాల కేసులకు సంబంధించిన వివరాలను ఇక నుంచి భారత్‌పోల్ ద్వారా ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షేర్ చేసుకోవచ్చు. రాష్ట్రాలకు భారత్‌పోల్ పట్ల శిక్షణ ఇవ్వాలని మంత్రి సీబీఐని కోరారు.