గ్రేటర్ నోయిడా: జాతీయ బాక్సింగ్ టోర్నీలో సీనియర్ బాక్సర్ అమిత్ పంగల్, సాగర్ ముందంజ వేశారు. ఆదివారం మొదలైన టోర్నీలో పురుషుల బాటమ్వెయిట్(50కి-55కి) తొలి రౌండ్లో ఎస్‌ఎస్‌సీబీ తరఫున బరిలోకి దిగిన అమిత్..ఉస్మాన్ మహమ్మద్ సుల్తాన్(బీహార్)పై ఏకపక్ష విజయం సాధించాడు. తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ అమిత్ ఆది నుంచే ప్రత్యర్థిపై పంచ్‌లు కురిపించాడు. మరో బౌట్లో సాగర్..ఎడ్విన్(కేరళ)పై చెమటోడ్చి గెలువగా, లాల్రామ్బౌత్..సంతోష్‌కుమార్(ఒడిశా)ను ఓడించి తదుపరి రౌండ్లోకి ప్రవేశించారు.
ఇదిలా ఉంటే టోర్నీలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సీనియర్ బాక్సర్లు ఏకంగా నాలుగు గంటల పాటు బౌట్ల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. రవాణాలో ఏర్పడిన సమస్య కారణంగా మొత్తం మూడు రింగులకు గాను సాయంత్రం 4 గంటల వరకు ఒకే రింగ్ తయారు కావడంతో ఆదివారం జరుగాల్సిన బౌట్లు సోమవారానికి వాయిదాపడ్డాయి. తొలిసారి జాతీయ పురుషుల, మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ జరుగుతున్న వేళ..ఏర్పాట్లపై నిర్వాహకులు దృష్టి సారించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది.