బౌద్ధధర్మానికి ప్రాక్టికల్ రూపమే అంబేద్కరిజం. మరొక విధంగా చెప్పాలంటే బౌద్ధానికి ఆచరణాత్మక రూపం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఇతర అనేక పుస్తకాలు. సిద్ధార్థ గౌతముడు జ్ఞానోదయం పొంది బుద్ధుడై బోధిసత్వుడైతే అంబేద్కర్ ప్రపంచ చరిత్రలను, చదువుల్లో మర్మాన్ని, మానవజాతి కష్టసుఖాలను సంపూర్ణంగా అర్థం చేసుకొని అపర బోధిసత్వుడయ్యాడు. బుద్ధుడు మానవజాతి ప్రాపంచిక దుఃఖమూలాలను అధ్యయనం చేసి దుఃఖ నివారణకోసం తృష్ణరహిత నైతికవర్తన జీవన విధానం అనే దివ్యౌషధాన్ని మానవజాతికందిస్తే – అంబేద్కర్ ఆ ఔషధాన్ని ఎలా ఉపయోగించుకొని ప్రాపంచిక దుఃఖాన్ని తరిమివేయాలో చెప్పాడు.
పే బ్యాక్ టు సోసైటీ విషయంగా చూసినా, అణగారిన జాతుల పక్షం వహించే భావజాలం రీతిలో చూసినా, భారత రాజ్యాంగ నిర్మాతగా చూసినా అందరాని ఎత్తులో ఉన్న అపరబోధిసత్వుడు అందరికీ అందేవాడే. అందుబాటులో ఉండేవాడే. బోధిసత్వుడు బుద్ధుడిని అవతార పురుషుల్లో కలిపి మనుషులకు అందుబాటులో లేకుండా చేసేట్టు చేసిన ప్రయత్నాలను ఎదుర్కొన్నట్టే, అపరబోధిసత్వుడు అంబేద్కర్‌ను భవిష్యత్ తరాలు అలా చేయకుండా ఉండటానికి ఈ విగ్రహం తరతరాలకు యుగయుగాలకు సాక్షీభూతంగా నిలుస్తుంది.
భారతదేశ మూలజాతుల, అణగారిన జాతుల దుఃఖనివారణకు మహావైద్యుడు మాత్రమే కాదు, అంబేద్కర్ ప్రపంచవ్యాప్త అణగారిన జాతుల విముక్తి ప్రదాత. ప్రపంచ మేధావులందరిలో ఉత్తమ మేధావిగా, మానవరత్నగా కొనియాడబడిన మహామనీషి. బుద్ధుడు ఆ కాలంలోనే చెప్పిన ‘బహుజన హి తాయ-బహుజన సుఖాయ’ను ఆచరణలో పెట్టడమే అంబేద్కరిజం ప్రధానలక్ష్యం.
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో దగ్గరకు ఓ భారతీయ ప్రముఖుడు వెళ్ళి నమస్కరించాడు. తనపేరు చెబుతూ ‘ఐయామ్ ఫ్రం ఇండియా’ అన్నాడు. పికాసో వెంటనే లేచి ని ల్చొని ‘ఓ యు ఆర్ ఫ్రం బుద్ధభూమి’అని చేతి లో చేయి వేశాడు. భారతదేశమంటే అతనికి బుద్ధభూమే. ప్రపంచమంటేనే బోధిసత్వుడన్నంతగా బుద్ధుని సిద్ధాంతాలు మనదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ మానవాళికి వి ముక్తినిచ్చేవిగా మారుతున్నాయి. అంబేద్కర్ ఇప్పుడు విశ్వనరుడు. ప్రపంచంలోనే అతిపెద్ద దైన లండన్ గ్రంథాలయంలో అంబేద్కర్ విగ్ర హం ప్రతిష్ఠింపబడిందంటే అంతకంటే గొప్ప గౌరవమేముంటుంది? అలాగే అంబేద్కర్ జన్మదినాన్ని ‘విశ్వశ్రేయస్సు దినం’గా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. బుద్ధుడు, అంబేద్కర్ కేవలం భారతదేశానికే పరిమితమైన వాళ్ళు కాదు, ప్రపంచ మానవాళికందరికీ కావాల్సిన వాళ్ళు.
అయితే ఈ దేశంలో పుట్టిన బౌద్ధాన్ని దేశం నుంచి తరిమివేసి చారిత్రక తప్పిదం చేసింది భారతజాతి. తత్ఫలితంగా బుద్ధభూమి యుద్ధభూమయింది. దేశంలో బౌద్ధం వ్యాప్తిచెందిన కాలం నుంచి ఏడెనిమిది వందలేండ్లు బౌద్ధధ ర్మం దేశాన్ని అఖండ భారత్‌గా నిలిపింది. మౌర్యరాజులకాలంలో భారతీయులు కుల, సామాజిక అంతరాలకు దూరంగా ఐక్యంగా ఉండటం వల్ల ఏ విదేశీయుడూ దేశంపై కన్ను వేయలేదు. దేశంలోంచి బౌద్ధం దూరమైన తర్వాత భారతీయులు కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, సామాజిక అంతరాలుగా చీలిపోయి పరస్పర కలహాలెక్కువయ్యాయి. విదేశీయులకు స్వాగతద్వారాలు తెరిచినట్టయింది. వెయ్యేండ్లకు పైగా విదేశీయుల పాలనలో మగ్గిపోయింది. లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజల బలిదానాలు, త్యాగాల ఫలితంగా భారతదేశం స్వతంత్ర భారతంగా ప్రజాస్వామ్యపాలనలోకి వచ్చింది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి దేశం వేలాది సంస్థానాధీశుల పాలనలో అనేక ముక్కలుగా విభజింపబడి ఉన్నది. మరోదిక్కు కులాలు, సామాజికాంతరాలు, మతవిభేదాలు, అంతర్గత కలహాలతో అట్టుడికిపోతుం ది. ఆర్యుల వర్ణవిభజన, ఆంగ్లేయుల విభజించి పాలించు విధానం, కుల,మత ప్రాంతీయ భా షా విభేదాలు, ఆర్థిక, సామాజిక అంశాలు, ప్రపంచంలో ఎక్కడా లేని అంటరానితనమనే సామాజిక రుగ్మత, నిరక్షరాస్యతలతో దేశం తీవ్ర సంక్షోభ స్థితిలో ఉన్నది. అలాంటి సమయంలో దేశ ప్రధానిగా పాలనాపగ్గాలు చేపట్టిన పండిట్ నెహ్రూ హయంలో పటేల్ సంస్థానాలన్నిటినీ విలీనం చేసి దేశాన్ని ఐక్యం చేశాడు.
అదే సమయంలో నవభారత నిర్మాణానికి రాజ్యంగం అవసరమని భావించిన నెహ్రు అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యంగ రచన కమిటీని నియమించాడు. న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ దేశ కుల స్వభావాన్ని, మతపరిస్థితులను, సామాజిక ఆర్థిక అంతరాలను, ప్రపంచదేశాల చరిత్రలనన్నిటినీ చదివిన అనుభవాన్ని, ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలన్న దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగ రచన చేశాడు. అనేక చట్టాలను అమల్లోకి తెచ్చా డు. అంబేద్కర్ రాసిన భారతరాజ్యాంగం ప్ర పంచదేశ రాజ్యాంగాలన్నిటిలోనూ ఉత్తమోత్తమమైనదిగా భావించబడింది. భారతరాజ్యాంగంలో బోధిసత్వుడి నైతిక ధర్మ సూత్ర మూలా లు, అశోకధర్మ చక్ర మూలాలు, ఫూలే జ్ఞాన సమాజ మూలాలతోపాటు ఈ దేశ ప్రజలందరి సౌఖ్యమయ జీవన మార్గాలున్నాయి. ఈ రా జ్యాంగాన్ని నూటికినూరుపాళ్ళు అమలు చేస్తే బుద్ధుడు కోరిన జన సుఖం, హితం సాధ్యమే.
కానీ కేంద్రాన్ని ఏలిన చాలా ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని గౌరవించినా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అందుకే చాలా సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయి. పాలించే పార్టీలు మారడం తప్ప ప్రజల మౌలిక సమస్యలు అపరిష్కృతంగానే ఉంటున్నాయి. ప్రతిపార్టీ ఎన్నికల్లో గెలువడమెలా?, అధికారాన్ని నిలబెట్టుకోవడమెలా? అని తప్ప దేశ ప్రజల బతుకుల్లో, పాలనారంగంలో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలేవీ చేయలేదు. ముఖ్యంగా ఈ దేశ అణగారిన కులాల, దళిత, బహుజనుల బతుకుల్లో పెనుమార్పులు రావాల్సిన అవసరాన్ని గుర్తించ లేదు.
దాదాపు దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న బీజే పీ ప్రభుత్వం దేశాన్ని ఉన్నస్థితిలో ఉంచకుండా మధ్యయుగాల్లోకి తీసుకెళ్తున్నది. దళిత, బహుజనుల, మైనారిటీల బతుకు వెతల ను పెంచుతున్నది. దేశాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ముంచి ఆ ధనాన్ని అతికొద్దిమంది ప్రపంచ ధనికులు కావడానికి ఉపయోగిస్తున్నది. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వ సంస్థలన్నిటినీ ప్రైవేటువారికి ధారాదత్తం చేస్తున్నది. దేశమంటే మనుషులు కాదు దేశమంటే మతమేనన్న రీతి లో విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రమాదకర ధోరణి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరాన్ని అన్ని రాజకీయపార్టీలు గుర్తించాలి.
ఈ ప్రమాదాన్ని గుర్తించిన మొదటి నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్. అందుకే బీఆర్ఎస్ను స్థాపించారు. దేశాన్ని రక్షించడానికి ‘దేశమంటే మనుషులోయ్’ అనే భావంతో మానవాభివృద్ధి సంబంధిత పథకాలను రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్న నాయకుడు కేసీఆర్.
వ్యవసాయాభివృద్ధి, రైతుసంక్షేమం, తాగు, సాగునీటి లభ్యత, ఉచిత కరెంటు, రుణమాఫీ, రైతుబంధు, ఐటీ అభివృద్ధి, సబ్బండ వర్ణాల వృ త్తిపర ఆదాయాల పెంపు, వృద్ధాప్య పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి అనేక పథకాలతో రాష్ర్టాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలబెట్టారు. అణగారిన జాతులవారైన దళితుల ఆత్మగౌరవాన్ని, ఆదాయ మార్గాలను పెంచి సాధికారత కల్పించడానికి దళితబంధును ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇలా సబ్బండ వర్ణాలను హృదయానికి హత్తుకొని రాష్ర్టాన్ని దేశానికే రోల్ మా డల్‌గా తీర్చిదిద్ది న కేసీఆర్ అంబేద్కర్ విగ్రహస్థాపన విషయంలోనూ దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతిస్వల్పకాలంలోనే తెలంగాణలో గోదావరి వరదనీరు వృథాకాకుండా కాళేశ్వరం వద్ద ఇంజనీరింగ్ వండర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం ఓ ప్రపంచాద్భుతమే. అలాగే దేశమంటే అంబేద్కరుడే అన్నంతగా విశ్వవ్యాప్తమైన అణగారినజాతుల ఆత్మబంధువు, విశ్వరత్న అంబేద్కర్ అతి పెద్దదైన 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ముందు స్థాపించ డం, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్ట డం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన చారిత్రాత్మక సంఘటన. అంబేద్కర్‌ను ఇంత గొప్పగా స్మరించుకోవడమంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని హృదయాలింగనం చేసుకొని గౌరవించుకోవడం. తెలంగాణలో ప్రారంభమైన ఈ చర్య దేశమంతటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచి భారతరాజ్యాంగ పరిరక్షణకు జవసత్వాలనందిస్తుందన్నది వాస్తవం.
బుద్ధుడు, అంబేద్కర్ ఇప్పటికీ, ఎప్పటికీ మనుషులే… స్థల కాలాల చైతన్యాన్ని జీర్ణించుకొని మానవజాతి దుఃఖ నివారణకోసం తమ సర్వస్వం అర్పించిన మానవోత్తములు…
-డా కాలువ మల్లయ్య
91829 18567