సుల్తాన్‌బజార్, డిసెంబర్ 18: కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివని మిధాని మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఎస్కే ఝా అన్నారు. శనివారం ఉస్మానియా దవాఖానలో సీఎస్ఆర్ కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్‌ను మిధాని డైరక్టర్ గౌరీ శంకర్, ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కరోనా మూడో దశ రావద్దని కోరుకుంటున్నానని అన్నారు. కరోనా రెండో దశ విజృంభణ సమయంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నా కొంత ఆలస్యంగా జరిగిందన్నారు.
రాష్ట్ర వైద్య, విద్యా అదనపు సంచాలకులు డాక్టర్ బి. నాగేందర్ మాట్లాడుతూ ఉస్మానియాకు వచ్చే రోగులకు సత్వరమే కృత్రిమ శ్వాస అందించేందుకు ఈ ప్లాంటు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పేద రోగులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ మిధాని అందించిన సాయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అనస్థీషియా విభాగం హెచ్‌వోడీ డాక్టర్ పాండు నాయక్, ఆర్ఎంవో డాక్టర్ ఎండీ రఫీ, నరేందర్, శ్రీనివాస్, మాధవి, టీఎస్ఎంఐడీసీ ఆధికారులు శ్రీరాములు, జగదీశ్ పాల్గొన్నారు.