హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : అంతరాష్ట్ర బదిలీలకు అవకాశం కల్పించాలని ఏపీ, తెలంగాణ ఎన్జీవోల సంఘం నేతలను ఉద్యోగులు కోరారు. నాంపల్లి టీఎన్జీవో కార్యాలయంలో టీఎన్జీవో, ఏపీ ఎన్జీవో సంఘాల నేతల ను కలిసి బదిలీలపై సంప్రదింపులు జరిపారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ, ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి పురుషోత్తమనాయుడు, ఉపాధ్యక్షులు రమణ, సాయిరాం సంప్రదింపుల్లో పా ల్గొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జిల్లా, జోనల్, మల్టీజోనల్ క్యాడర్ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వలేదు. దీంతో స్థానికేతర ఉద్యోగులు ఏపీ, తెలంగాణ ల్లో పనిచేస్తున్నారు. రిజర్వేషన్లు, స్థానికత కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. త్వరలోనే ముఖ్యమంత్రులను కలిసి సమస్యల పర్కిష్కారానికి కృషిచేస్తామని ఇరు రాష్ర్టాల ఉద్యోగులకు నేతలు హామీ ఇచ్చారు.