రాజన్న సన్నిధిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల దందాకు తెరలేచిందా..? అందుకు అమాత్యులే పోటాపోటీగా పైరవీలు చేస్తున్నారా..? అవసరం లేకపోయినా కొలువుల్లో పెడుతున్నారా..? అంటే తాజాగా వెలువడిన ఉత్తర్వులను చూస్తే అవుననే అర్థమవుతున్నది. దీని వెనుక పెద్ద తతంగమే జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే పదకొండు మందిని నియమించుకోవాలని కొంతమంది మంత్రులు దేవాదాయశాఖకు సిఫారసు చేయగా, అందులో ఓ మంత్రి ప్రతిపాదించిన వ్యక్తుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. దీనిని తిరస్కరించిన అధికారులపై సదరు మంత్రి కన్నెర్ర చేయగా, మరో జిల్లాయేతర మంత్రి పట్టుబట్టి నలుగురికి పోస్టింగ్ ఇప్పించుకున్న తీరు హాట్‌టాపిక్‌గా మారింది. ఇది ఇలా ఉంటే.. తాజాగా తిరస్కరించిన వారితో కలిపి మరో 15 మందిని ఔట్ సోర్సింగ్ కింద నియమించాలని దేవాదాయశాఖకు సిఫారసులు వెళ్లాయని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా అతి త్వరలోనే వెలువడుతాయని అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతున్నది. దీనిపై స్థానిక యువతీ యువకులు రగులుతున్నారు. గతంలో దరఖాస్తు చేసుకొని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తమకు రిక్తహస్తం చూపుతున్నారని మండిపడుతున్నారు.
కరీంనగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న సన్నిధిలో ఔట్సోర్సింగ్ పోస్టుల దందాకు తెరలేచింది. సాదాసీద వ్యక్తులు కాదు, ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే కొంతమంది మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులే ఈ దందాకు తెరలేపినట్టు తాజాగా వెలువడిన ఉత్తర్వులను బట్టి అర్థమవుతున్నది. నిజానికి రాజన్న అలయంలో పలు విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం గతంలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా పనిచేసిన సందీప్‌కుమార్ ఝా ఇంటర్వ్యూలు నిర్వహించారు. చాలా మంది స్థానిక నిరుద్యోగులు పిల్లపాపలతో వచ్చి, అర్ధరాత్రి వరకు పడిగాపులు గాసి మరీ హాజరయ్యారు. పోస్టులు వస్తాయని ఎదురుచూసే సమయంలోనే కలెక్టర్ బదిలీపై వెళ్లిపోయారు. దీంతో ఆ ఇంటర్వ్యూలు, చేసుకున్న దరఖాస్తులు అక్కడే నిలిచిపోయాయి. అయితే ఎప్పటికైనా తమకు ఉద్యోగాలు రాకపోతాయా..? అని ఎదురుచూస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు ఆశలపై నీళ్లు చల్లుతున్నట్టు తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రాజన్న ఆలయ పరిధిలో ఔట్ సోర్సింగ్ కింద పనిచేయడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాతోపాటు జిల్లాయేతర మంత్రులు కలిసి పదకొండు మంది పేర్లను దేవదాయశాఖకు సిఫారసు చేసినట్టు తెలిసింది. అందులో నలుగురిని జిల్లాయేతర మంత్రి సిఫారసు చేయగా.. మిగిలిన ఏడుగురిని ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సిఫారసు చేసినట్టు తెలిసింది. ముందుగా దేవాదాయ అధికారులు ససేమిరా అన్నా, ఆ తర్వాత అమాత్యుల ఒత్తిడి మేరకు ఓకే చెప్పి ఉత్తర్వులు కూడా ప్రిపేర్ చేసినట్టు తెలిసింది. ఈ సమయంలో వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు వివరాలను పరిశీలిస్తే.. ఓ మంత్రి ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి సిఫారసు చేయగా.. మరో మంత్రి భార్యాభర్తల పేర్లను సిఫారసు చేసినట్టు అధికారులు గుర్తించి, సదరు పదకొండు మందికి సంబంధించిన ఉత్తర్వులు నిలిపివేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి జిల్లా మంత్రు లు తప్పుడు సిఫారసులు చేస్తే.. తాను పంపించిన సిఫారసుల నియామకాలు ఎందుకు నిలిపివేశారంటూ జిల్లాయేతర మంత్రి అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీంతో సదరు జిల్లాయేతర మంత్రి ప్రతిపాదించి, సిఫారసు చేసిన నలుగురిని ఔట్ సోర్సింగ్ కింద నియమిస్తూ కొద్ది రోజుల క్రితమే అధికారిక ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తున్నది.
పదకొండు మందిలో నలుగురుకి ఉత్తర్వులు వెలువడగా.. మిగిలిన ఏడుగురిని కూడా నియమించేందుకు సదరు మంత్రులు దేవాదాయశాఖాధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తున్నది. అందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని, భార్యాభర్తలకు సిఫారసు చేసిన విషయాన్ని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా.. వారి స్థానంలో ఇతరుల పేర్లను చేరుస్తూ తిరిగి మరో జాబితా పంపినట్టు తెలిసింది. ఇది ఇలా ఉంటే.. ఉమ్మడి జిల్లాచెందిన పలువురు ప్రజాప్రతినిధులు మరో ఎనిమిది మందిని సిఫారసు చేసినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలు కూడా దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించినట్టు తెలిసింది. కొత్తగా ఎనిమిది మంది ప్రతిపాదనల వెనుక కూడా బలమైన ఒత్తిడి ఉండడంతో పాత, కొత్త కలిపి మొత్తం 15 మందిని ఔట్ సోర్సింగ్ కింద నియమించడానికి ఉత్తర్వులు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. అతి త్వరలోనే ఈ ఉత్తర్వులు కూడా వెలువడుతాయని దేవదాయశాఖ వర్గాల నుంచి సమాచారం వస్తుండగా.. గతంలో ఇచ్చిన పేర్లను తిరస్కరించిన అధికారులపై సదరు మంత్రులు ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. అందుకే అధికారులు ఆ మంత్రుల ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి కొత్త సిఫారసులకు ఒకే చెప్పినట్టు తెలిసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు పది పన్నెండు వేల మంది నిరుద్యోగులు.. ఈ ఔట్ సోర్సింగ్ పోస్టులకు అర్హత కలిగి ఉన్నారు. రాజన్న సన్నిధిలో ఏమైనా ఔట్సోర్సింగ్ పోస్టులు అవసరమైతే.. ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి, అర్హత ఉన్న స్థానిక యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుడేందని వీరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సందీప్‌కుమార్ ఝా కలెక్టర్‌గా ఉన్నప్పుడు రాజన్న ఆలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాల కోసం యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకూ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆయన బదిలీపై వెళ్లడంతో ఆ ప్రకియ నిలిచిపోయింది. తాజాగా రాజన్న ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ చర్చనీయాంశమవుతుండగా, ఆ పోస్టులు స్థానికులకే దక్కాలన్నా డిమాండ్ వస్తున్నది.
ఒకవేళ పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే.. గతంలో ఇంటర్వ్యూలకు హాజరైన వారిలో అర్హత ఉన్న యువతీ యువకులను ఎంపిక చేసినా స్థానికులకు అవకాశం దక్కేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కానీ, అధికార బలాన్ని అడ్డు పెట్టుకొని స్థానికుల ఆశలపై నీళ్లు చల్లుతూ.. స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తున్న తీరుపై యువత భగ్గుమంటున్నది. తాజాగా నియమితులైన నలుగురిలో ఏ ఒక్కరూ స్థానికులు కాదని విశ్వసనీయ సమాచారం. ఈ పరిస్థితుల్లో కొత్తగా 15 మందికి ఆర్డర్లు రాకముందే.. స్థానిక యువతీ యువకులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. జిల్లాలో వేలాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా.. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇతరులకు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్ష స్థానిక నాయకుల ఎలా స్పందిస్తారో మున్ముందు తేలనుండగా.. రాజన్న సన్నిధిలో ఔట్ సోర్సింగ్ పోస్టుల కోసం కొంత మంది మంత్రులు పోటాపోటీగా సిఫారసులు చేస్తున్న తీరు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.