రామకృష్ణ పరమహంస వేదాంత సత్యాలను తాము అనుభూతి చెందడమే కాక, శిష్యులు-భక్తులతో కూడా ఆ సత్యాలను ఆవిష్కరింప చేయగల ఆధ్యాత్మిక శక్తి సముద్రం. హైందవ ధర్మసాధనలనే కాదు, అన్యమత పారమార్థిక సాధనల్ని కూడా అనుష్ఠించారు. ఆ ఫలాలను పొంది, ఆ గ్రంథాల్లోని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా జిజ్ఞాసువులకు పంచిన జ్ఞానవరిష్ఠులు. పరమహంస యోగి మాత్రమే కాదు, యోగీశ్వరుడు కూడా! జ్ఞాని మాత్రమే కాదు విజ్ఞాని కూడా!
‘ఇనుమును అయస్కాంతం ఆకర్షించే తీరులో భగవంతుడు మనలను సర్వధా ఆకర్షిస్తూనే ఉన్నాడు. కానీ ఇనుమును మట్టితో కప్పివేసి ఉన్నప్పుడు అయస్కాంతం ఆకర్షించదు. మట్టిని కడిగివేసిన మరుక్షణమే అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. అలాగే మనసంతా మాలిన్యాల మట్టి ఆవరించి ఉంటే భగవంతుడి వైపు మొగ్గుచూపదు. అందుకే ముందు మనసు పునీతమవుతే, పరమాత్మ ఆకర్షణకు నోచుకుంటుంది’ అనేవారు పరమహంస. ఆ మాటలు అక్షర సత్యాలు. మనసులో చింతను తొలగించిన మరుక్షణం చింతన మొదలవుతుంది. సాధన తీవ్రమవుతుంది. భగవత్ అనుగ్రహమూ లభిస్తుంది.
‘మీరు సంసారంలో ఉన్నంత కాలం భగవంతునికి మీ ముఖ్తార్ నామా (పవర్ ఆఫ్ అటార్ని) ఇచ్చేయండి. మీ బాధ్యతలన్నీ ఆయన పరం చేయండి. ఆయన ఇచ్ఛ మేరకు నిర్వర్తిస్తాడు. ధనవంతుని ఇంటి దాసీలాగా ఈ సంసారంలో జీవించండి. ఆమె తన యజమాని పిల్లలకు స్నానం చేయిస్తుంది. ఆహారం తినిపిస్తుంది. వారు తన సంతానమే అన్నట్లుగా వాత్సల్యంతో అనేక విధాలుగా వారి ఆలనాపాలన చూసుకుంటుంది! కానీ వారు తన పిల్లలు కారనే విషయం ఆమెకు తెలుసు. అలాగే మనమూ ఈ లోకంలో మసలుకోవాలి’ అంటారు రామకృష్ణులు. రాగద్వేషాలు, సంతోషాలు, దుఃఖాలు, ఆనందాలు, అనుమానాలు ఇవన్నీ తాత్కాలికమైనవే. ఏదీ స్థిరంగా ఉండదు. అన్నీ వచ్చిపోయేవే! ఈ అనుభవాలన్నిటినీ మనసులో దాచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
దేవుడికి కావలసింది ఆర్భాటాలు కాదు, శుద్ధభక్తి అని చెబుతుండేవారు పరమహంస. ‘పశుగ్రాసం, గానుగపిండి ఆవుకు రుచించే విధంగా భగవంతుడికి పేదల, దీనుల భక్తి ఎంతో రుచిస్తుంది. సర్వేశ్వరుడు కోరుకునేది సరళతను, శుద్ధభక్తిని. రారాజు దుర్యోధనుడు తన సిరిసంపదల వైభవాన్ని చూపి, శ్రీకృష్ణుడిని తన మందిరానికి ఆహ్వానిస్తాడు. కానీ, వాసుదేవుడు పేదవాడైన విదురుడి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. భగవంతుడు భక్త వత్సలుడు. దూడ వెంట పరుగెత్తే ఆవులా భగవంతుడు భక్తుడి వెంటపడి పోతూ ఉంటాడు’ అని రామకృష్ణులు చేసిన హితబోధ నిజమైన భక్తులను భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడో తెలియజేస్తుంది.