ప్రస్తుతం విద్యార్థుల పైచదువుల ప్రవేశాల సమయం నడుస్తున్నది. తాము ఎంచుకున్న కోర్సులో విజయం సాధించాలంటే ఆ కోర్సులపై ఇష్టంతో పాటు ప్రతి ఒక్కరికీ ఒక సమున్నత లక్ష్యం ఉండాలి. దానిని సాధించేందుకు తగిన సాధనా సంపత్తిని అలవరుచుకోవాలి. అందుకు తగ్గ సూత్రాల గురించి సనాతన గ్రంథాలు స్పష్టంగా పేర్కొన్నాయి. వాల్మీకి రామాయణాన్ని పరిశీలిస్తే.. కార్యదక్షత, కర్మశీలతకు సంబంధించిన అనేక ఆదర్శాలు కనిపిస్తాయి. ఆ విశేషాలే ఇవి..
అతినిద్ర, కునుకుపాటు, బద్ధకం, ఉద్రేకం, వాయిదాలు వేసే మనస్తత్వం ఉన్నచోట విజయం లభించదు. ఉత్సాహం, సాహసం, ధైర్యం, ప్రయత్నం ఉన్నచోట విజయం ఉంటుందని రామాయణంలోని కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండలలో హనుమంతుడు వేసిన ప్రతీ అడుగు తెలియపరుస్తుంది. కార్యసఫలతకు కావలసిన లక్షణాలు ఏమిటో అవగతమవుతుంది. అందుకే మన పెద్దలు.. ‘బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతా.. అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్..!’ అని పేర్కొన్నారు. హనుమంతుడిని స్మరిస్తే చాలు.. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, జాఢ్యం లేకపోవడం, వాక్పటుత్వం వస్తాయని చెప్పారు.
రామాయణంలోని సుందరకాండలో హనుమ పేర్కొన్న అంశాలు నేటి విద్యార్థులకు విజయ సూత్రాలు. అవి అనుసరణీయాలు.. ‘ధృతిః దృష్టిః మతిః దాక్ష్యం స్వకర్మసు నసీదతి’ ధృతి అంటే పట్టుదల, ఆత్మవిశ్వాసం. దృష్టి అంటే ఏకాగ్రత- పని మీద శ్రద్ధ. మతి అంటే బుద్ధిబలం, ప్రణాళికా రచన(ప్లానింగ్). దాక్ష్యం అంటే సమర్ధత. ఈ నాలుగింటితో పాటు సచ్చీలత అనే ఐదో లక్షణం ఎవరికి ఉంటాయో వారినే విజయం వరిస్తుంది. హనుమంతుడి సముద్ర లంఘనం మొదలుకొని సీతాన్వేషణం, లంకా దహనం తర్వాత తిరిగి శ్రీరాముడి దగ్గరికి చేరేవరకు జరిగిన ప్రతీ సందర్భంలో ఈ సూత్రాలు అంతర్లీనంగా కనిపిస్తాయి.
హనుమంతుడు మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనానికి సిద్ధపడినప్పుడు ‘ఈ సాగరాన్ని నేను అవలీలగా దాటుతాను. పనిని సఫలం చేసుకువస్తాను’ అని వానరులకు అభయమిచ్చాడు. దీనిద్వారా ఒక పని చేసే సమయంలో ఆత్మవిశ్వాసం ఉండాలని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆత్మవిశ్వాసం మొదటిసూత్రం. సముద్ర లంఘన సమయంలో మొదట ఎదురైనది మైనాక పర్వతం. తన శిఖరాలపై కాసేపు విశ్రమించి తన ఆతిథ్యం స్వీకరించమని మైనాకుడు హనుమంతుడిని కోరుతాడు. ‘నీ తండ్రి వాయుదేవుడి సహకారం వల్లే నేను క్షేమంగా సముద్రంలో ఉన్నాను’ అంటాడు మైనాకుడు. సహకరించిన వారికి ఎలా కృతజ్ఞత చూపించాలో చెబుతుందీ సందర్భం.
హనుమ మాత్రం మైనాకుడి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి తాను అనుకున్న పని నెరవేరే వరకు విశ్రమించేది లేదని చెబుతాడు. ఈ ఘటన వల్ల తెలుస్తున్న రెండో సూత్రం అవిశ్రాంత ప్రయత్నం. ఆ తర్వాత సురస అనే శక్తి హనుమంతుడిని అడ్డుకుని మింగ జూస్తుంది. హనుమంతుడు యుక్తితో సూక్ష్మరూపం ధరించి సురస నోటిలోకి ప్రవేశించి, వెలుపలికి వచ్చి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇక్కడ హనుమ చెప్పిన మూడోసూత్రం యుక్తి.
ఇక సింహిక అనే రక్కసి పట్టు నుంచి బలిమితో బయటపడి లంకను చేరుతాడు హనుమ. అక్కడ లంకిణికి బుద్ధి చెబుతాడు. తర్వాత లంకలో రాక్షసుల కంటపడకుండా తనని తాను తగ్గించుకుని సీతాన్వేషణ కొనసాగిస్తాడు. అనువుగాని చోట అధికులం అనకుండా తన బుద్ధికుశలతను ప్రదర్శించాడు హనుమ. అహంకారంతో అన్నిటా తన బలాన్ని ప్రకటించుకుని గుర్తింపు పొందాలనే తాపత్రయం పనికిరాదని.. సీతాన్వేషణ ఘట్టంలో హనుమ వ్యవహరించిన తీరు చెబుతుంది.
ఈ అన్వేషణలో భాగంగా అంతఃపురంలో ఆదమరచి నిద్రిస్తున్న అనేకమంది స్త్రీలను చూశాడు హనుమ. పరస్త్రీలను నిద్రలో ఉన్నప్పుడు చూడటం తగునా అని తనను ప్రశ్నించుకున్న ఆంజనేయుడు ‘ఒక మహిళను, మహిళలల్లోనే కదా వెతకాలి. నా దృష్టి సీతమ్మవారిని వెతకడం మీదే ఉంది తప్ప.. మరే వికారం లేదం’టూ సర్దిచెప్పుకొన్నాడు. ఈ సమయంలో హనుమ ప్రదర్శించిన సూత్రం కార్యసాధకుడు ఏ వికారాలకు లోనుకాకుండా ధీరత్వాన్ని కలిగి ఉండాలని సూచిస్తుంది. సచ్చీలత (క్యారెక్టర్) చాలా ముఖ్యం. విజయానికి ఇది ఐదో సూత్రంగా ప్రకటిస్తాడు హనుమ.
ఏ విజయంలోనైనా ఈ గుణాలు కీలక భూమిక పోషిస్తాయని రామాయణంలో వాల్మీకి మహర్షి హనుమంతుడి సముద్ర లంఘనం, సీతాన్వేషణం, మైథిలీ దర్శనం, లంకాదహనం ద్వారా ఆవిష్కరించారు. ఈ లక్షణాలు నేటి కాలంలో ప్రతీ విద్యార్థికి అవసరం. పోటీపరీక్షలే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఈ సూత్రాలు విజయవంతమైన జీవన గమనానికి సోపానాలుగా నిలుస్తాయి.