High Court | అలహాబాద్ : వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తాడును లాగడాన్ని అత్యాచారంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తీర్పు చెప్పి మూడు వారాలు కూడా గడవక ముందే అదే హైకోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి కూడా అదే తరహా తీర్పునిచ్చారు. అత్యాచారం కేసును విచారిస్తూ.. బాధితురాలే సమస్యను కోరి కొనితెచ్చుకుందని, ఇందులో ఆమెకు కూడా సమాన బాధ్యత ఉందంటూ వ్యాఖ్యానించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లోని ఓ బార్లో కలుసుకున్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ తన ఉత్తర్వులో ఈ వ్యాఖ్యలు చేశారు.
నిందితుడు నిశ్చల్ చందక్పై నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం బాధితురాలు పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థిని. నోయిడాలోని ఓ లేడీస్ హాస్టల్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటోంది. గత ఏడాది సెప్టెంబర్ 21న ఆమె తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలసి హౌజ్ ఖాస్‌లోని ఓ బార్‌కు వెళ్లింది. తెల్లవారుజాము 3 గంటల వరకు వారు మద్యం సేవించారు. బాగా మత్తెక్కిపోవడంతో తన హాస్టల్‌కి వెళ్లడానికి ఆమెకు తోడు అవసరమైంది. అక్కడే ఆమెకు నిశ్చల్ పరిచయమయ్యాడు. తన ఇంటికి తీసుకెళతానని చెప్పిన అతడు, ఆమెపై రెండుసార్లు అత్యాచారం చేశాడన్నది ఆరోపణ. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడి తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ బెయిల్ మంజూరు చేస్తూ, ఇద్దరూ పరస్పర అంగీకారంతో లైంగికంగా కలసినట్టు పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.