న్యూఢిల్లీ: రాబోయే 12 నుంచి 18 నెలల కాల వ్యవధిలో దాదాపు అన్ని రకాల వైట్కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆక్రమించే అవకాశం ఉన్నదని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం అధిపతి ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాటాడుతూ ఏఐ వ్యవస్థలు వృత్తిపరమైన పనులలో వేగంగా మానవస్థాయి పనితీరుకు చేరుకుంటాయని తెలిపారు. ముఖ్యంగా కంప్యూటర్ ఆధారిత పనులైన న్యాయ, అకౌంటింగ్, మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తదితర రంగాలు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయన్నారు. రాబోయే కాలంలో ఈ పనులన్నీ ఆటోమేట్ అవుతాయన్నారు. ఏఐ మోడళ్లు శరవేగంతో పెరగడమే ఈ భారీ మార్పునకు ప్రధాన కారణమన్నారు. సమస్యల పరిష్కారం, దైనందిన నిర్ణయాలు తీసుకునే పనులలో ఏఐ మోడళ్లు మనుషులను మించిపోతాయని ముస్తఫా సులేమాన్ పేర్కొన్నారు.