ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అయితే, ఈ ఉల్లితో ఉన్న ఉపాయాలన్నీ మేలు చేస్తాయనేది మాత్రం నిజం కాదట. ఉల్లిపాయలను అరికాలుకు కట్టుకుంటే రాత్రికి రాత్రే శరీరంలో ఉన్న విష కారకాలను పీల్చేస్తుందని చాలామంది చెబుతుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలకు ఆదరణ బాగానే ఉంది. చూసింది చేయడం నెటిజన్లకు ఉన్న అలవాటే. అయితే ఇది వైజ్ఞానికంగా నిరూపితమైనదేనా అంటే.. అలాంటి ఆధారాలేమీ లేవని వైద్యులు అంటున్నారు. చర్మం నుంచి శరీరంలోని ఏ జీవ ద్రవాన్ని, జీవ పదార్థాన్నీ బయటి వస్తువులు సహజంగా తీసుకోలేవని చెబుతున్నారు. చర్మం మన శరీరానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే అవయవం మాత్రమే. ఇది శరీరంలోని రక్త ప్రవాహాన్ని, పోషక పదార్థాలను బయటికి రాకుండా నిరోధిస్తుంది.
అలాగే బయటి వాతావరణంలోని రసాయనాలు, పదార్థాలేవీ శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడుతుంది. చర్మానికి ఉండే ఈ సహజ లక్షణాన్ని ఉల్లిగడ్డ ముక్కలు అధిగమించి పోలేవని చెబుతున్నారు. గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలను పాదాలకు ఆనించి, సాక్స్ లేదా కవర్ తొడిగి రాత్రంతా పడుకుంటే శరీరం డిటాక్స్ అయిపోతుందనేది కేవలం భ్రమేనని డాక్టర్లు చెబుతున్నారు. అలా జరగాలంటే చెమట పట్టేలా వ్యాయామం చేయడం, మలబద్దకం తలెత్తకుండా పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తినడం మేలని సూచిస్తున్నారు. అయితే ‘ఉల్లి చేసే మేలు ఉత్తదేనా? అని సందేహించకండి. ఉల్లిపాయలో అధికంగా ఉండే ఐరన్, సల్ఫర్ రక్తం పెరుగుదలకు, ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అందులో సందేహం లేదు.