భీమదేవరపల్లి, జూన్ 30 : సహకార రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఇటీవల ఐదు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవమైన విషయం విదితమే. ఇందులో భాగంగా సోమవారం ముల్కనూరు ప్రధాన కార్యాలయంలో పాలకవర్గ సభ్యులు సమావేశమై అధ్యక్షుడిగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా గజ్జి వీరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహకార ఎన్నికల అధికారి కోదండరాములు సమక్షంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సహకార సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత కాశీ విశ్వనాథ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. సభ్యులు వ్యక్తిగత నిర్ణయాలకు తావివ్వకుండా సమిష్టి నిర్ణయాలతో అభివృద్ధి కాంక్షించాలని సూచించారు. సహకార సంఘం చేపడుతున్న క్రయవిక్రయాలపై సంఘం కొనసాగుతున్న తీరుపై సభ్యుల సలహాలు, సూచనలను తీసుకుంటామని చెప్పారు. 1956లో స్థాపించబడిన ముల్కనూరు సహకార సంఘం విధి విధానాలను గూర్చి కొత్త తరానికి చెప్పాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన యువకులకు సహకార సంఘాల సూచనలు, విధివిధానాలు తప్పక చెప్పాలన్నారు.
ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందన్నారు. మార్కెట్ లోకి వెళ్తున్న ఉత్పత్తులపై నాణ్యత ప్రమాణాలను పాటిస్తామని హామీ ఇచ్చారు. సంఘం కార్యకలాపాల్లో తప్పులు జరుగుతున్నట్లు మీ దృష్టికి వస్తే తప్పక మాకు చెప్పాలని కోరారు. ముల్కనూరు సహకార సంఘం బలోపేతానికి సభ్యులు మరింత కృషి చేయాలని కోరారు.
తనపై నమ్మకంతో సంఘ అధ్యక్షులుగా 39వ సారి ఏకగ్రీవం చేసిన సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు బొల్లంపెల్లి కుమారస్వామి, గసవేన శ్రీనివాస్, గుర్రాల భాస్కర్ రెడ్డి , కాసిరెడ్డి వసంత, ఆంబాల రాములు, బేల కనకమ్మ, కర్రె మహేందర్, కంది రవీందర్ రెడ్డి, మండ శ్రీనివాస్, చవ్వల్ల బుచ్చయ్య, ఈర్ల మూగయ్య, గుగులోతు భాశు, బొల్లపెల్లి వీరారెడ్డి, జీఎం మారుపాటి రాంరెడ్డి, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.