సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : నగరానికి త్రీడీ నమూనాలో ఇమేజింగ్ చేయాలనే కేసీఆర్ ప్రతిపాదనలకు ఎట్టకేలకు కార్యరూపంలోకి వచ్చాయి. నగరాన్ని పోలినట్లుగా ఉండే 3డీ డిజిటల్ ట్విన్ సిటీ రూపొందించేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు ఈఓఐ(ఆసక్తి కనబర్చిన సంస్థలను ఆహ్వానిస్తోంది. అవుటర్ రింగు రోడ్డు పరిధి దాటి విస్తరించిన రూ. 2053 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కవర్ చేస్తూ డిజిటల్ ట్విన్ను రూపొందించాలనే ప్రణాళికలను హెచ్ఎండీఏ ఖరారు చేసింది.
ఈ ప్రాంతాన్నీ ప్రత్యక్షంగా చూసి న అనుభూతి కలిగించేలా డిజిటల్ ట్విన్ పనిచేయనుంది. అత్యాధునిక 3డీ స్కానర్లు, డ్రోన్ల సాయంతో చిత్రీకరణ చేసి, ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీ, వరదలు వంటి పరిస్థితుల్లో వేగంగా స్పందించి సమస్యలను అదుపులోకి తీసుకురావడంలో డిజిటల్ ట్విన్ సాయపడుతోంది. దీని ద్వారా శరవేగంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉండేలా గతంలోనే బీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
అయితే రెండేళ్ల తర్వాత అటకెక్కిన ప్రతిపాదనలను బయటకు తీసిన సర్కారు… మొదటి దశలో అవుటర్ రింగు రోడ్డు వరకు ఉన్న మొత్తం నగరాన్ని కవర్ చేస్తూ డిజిటల్ ట్విన్ తయారీ పనులు చేపట్టనున్నారు. దీంతో వరద ముప్పు, ట్రాఫిక్ రద్దీ, అగ్ని ప్రమాదాల విపత్కర పరిస్థితులను నిలువరించేలా సాయపడనుంది.