పెన్‌పహాడ్, మార్చి 23ర : ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామస్తులు నడుం బిగించారు. బెల్ట్ షాపుల భరతం పట్టాలని సంకల్పించారు. గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తూ గ్రామ సభలో ఇటీవల తీర్మానం చేశారు. మళ్లీ సోమవారం నాడు గ్రామ సర్పంచ్, మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు సమావేశమై గతంలో చేసిన మద్యపాన నిషేధ తీర్మానంపై చర్చించి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ర్యాలీ నిర్వహించారు. ఎవరూ బెల్ట్ షాపులు నిర్వహించొద్దని హెచ్చరించారు. మద్యం అమ్ముతున్న వారిని గుర్తించి జరిమానా విధించడం జరుగుతుందని, అమ్మినా తాగినా పోలీస్ వారిచే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ గ్రామంలో సుమారు 420 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ ప్రజలు 1,500 మంది. ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు. కాగా గ్రామానికి చెందిన చాలామంది చుట్టుపక్కల తండాలో దొరికే నాటుసారా, మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. యువత తాగుడుకు అలవాటు పడి ప్రాణాలను, భవిష్యత్‌ను కోల్పోతున్నారు. తగాదాలతో కుటుంబాలకు దూరమవుతున్నారు. దీంతో గ్రామానికి చెడ్డపేరు వస్తుందని భావించి గ్రామస్తులంతా ఏకమై మద్యపానాన్ని నిషేధించాలని తీర్మానం చేశారు. గ్రామంలో బెల్టుషాపులు లేకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. మద్యం తాగితే రూ.500, అమ్మినవారికి రూ.10 వేలు జరిమానా విధిస్తామని, వారిని పట్టించిన వారికి రూ.వెయ్యి బహుమతి అందిస్తామని తీర్మానం చేశారు. ఈ మేరకు అందరూ ప్రమాణం చేశారు.
ఇలా గ్రామాలు మద్యపానం నిషేధిస్తే నేటి తరానికి ఎంతో ప్రయోజనం చేకూర్తుందని, గ్రామస్తులందరూ పూర్తిగా తమ పనుల్లో నిమగ్నమై ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయన్నారు. గ్రామ పెద్దల ఆలోచన భవిష్యత్ తరాల మార్గం నిర్దేశాలుగా మారతాయని, కష్టసుఖాల్లో తోడు ఉంటూ, క్రైమ్ రేట్ ను తగ్గించుకుంటూ, రాష్ట్రంలోని మిగతా గ్రామాలకు తమ గ్రామాలు ఆదర్శంగా నిలవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా ఎదగాలని స్వచ్ఛందంగా గ్రామ సభ వేదిక ద్వారా తీర్మానం చేసుకున్నామని అక్కడి ప్రజలు పిలుపునిచ్చారు.