ఇంద్రధనుస్సు రంగులతో కూడిన లైటింగ్.. ఎక్కడో పాడుతున్నట్టుగా వినిపిస్తున్న లైట్ మ్యూజిక్.. వీటి మధ్యన అందంగా నిర్మించిన ఓ రాక్‌లో విభిన్న ఆకృతుల్లో ఉన్న మద్యం బాటిళ్లు.. వాటిని ఆనుకుని అనేక రకాల గ్లాసెస్.. గిరగిర తిరిగే కుర్చీలు.. సంధ్యా సమయాన్ని తలపించే వెలుతురు… ఇవన్నీ చూస్తే అది బార్ అనే భావన కలుగుతుంది. కానీ అది ఓ అపార్ట్మెంట్లోని ఓ గది. అదేంటి అనుకుంటున్నారా..? ఔను ఇప్పుడు సిటీలో హోం బార్ కల్చర్ ట్రెండ్
మార్మోగుతుంది. ఒకప్పుడు హోం బార్ కల్చర్ వీఐపీల ఇంటికే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు సామాన్యుల వరకూ వచ్చేసింది.ఉన్న ఇంట్లోనే రెండు పెగ్గులు లాగించడానికి బార్‌ను తలపించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారికి నచ్చిన వస్తువులతో ఆ గదిని తీర్చిదిద్దుకుంటున్నారు. డ్రంకన్ డ్రైవ్.. తాగి పట్టుబడితే జైలు.. కరోనా, ఒమిక్రాన్ కేసుల భయాలు వెంటాడుతున్న సమయంలో ఇంట్లోనే ఓ గదిని మద్యం ప్రియులు బార్గా మార్చుకుంటున్నారు. ఇంట్లోనే నచ్చినన్ని పెగ్గులు ఆరగించి ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రతి ఇంటా ఓ బార్ రూం.. ఔను ఇప్పుడు నగరవాసులు నిర్మించుకుంటున్న తమ కలల సౌధంలో అన్ని గదులతో పాటు బార్ గది కూడా చేరింది. కిచెన్ నుంచి పూజ, వ్యాయామ గదులతో పాటు బార్ రూంలలో నచ్చిన ఇంటీరియర్ డిజైన్స్ అమర్చుకుంటున్నారు. ఇప్పుడు హోంబార్ కల్చర్ సిటీలో పెరుగుతుంది. ఇంటికి స్నేహితులు, బంధువులు వస్తే బయటకు వెళ్లి లాగించే ఆ పెగ్గులు ఇంట్లోనే తమ బార్ రూంలో పెగ్గేసి ఆతిథ్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ‘క్యా చాహియే.. ఏక్ పెగ్ లీజియే..’ ఈ సరదా మాటలు ఇంట్లో ట్రెండీగా మారాయి. ఇక విల్లాల్లో ఏకంగా ఓ మినీ బార్‌ను పోలిన విధంగా ఫ్లోర్ మొత్తం బార్గా ఉపయోగించుకోవడం విశేషం. మొత్తంగా హైదరాబాద్‌లో హోం బార్ కల్చర్ విస్తృతమవుతుంది.
స్లో మ్యూజిక్‌లో ఏక్ పెగ్
వారికి నచ్చిన మద్యం బాటిల్లు మాత్రమే కాదు.. సకల బ్రాండ్లు రాక్‌లో ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరు ఏ బ్రాండ్ అడిగినా లేదనకుండా అరెంజ్ చేయడమే స్టేటస్‌గా భావిస్తున్నారు. ఫారిన్ సరుకు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. బాటిల్ పూర్తవగానే ఆ మరుసటి రోజు మరో బాటిల్‌తో దాని స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఏ గెస్ట్ ఏ మందు అడుగుతాడో ముందే గుర్తించి.. అందుకు సంబంధించిన బ్రాండ్లను అందుబాటులో ఉంచుకుంటున్నారు. మణికొండలోని ఓ విల్లాలో ఓ ఫ్లోర్‌ను తాగటానికే కేటాయించి.. అందంగా తీర్చిదిద్ది వీకెండ్వీకెండ్ పార్టీలతో సరదాగా గడుపుతున్నారు.
అదిరేలా ఇంటీరియర్ డిజైన్
ప్రత్యేకంగా ఇండ్లను నిర్మించుకుంటున్న వారు ఆ ఇంటిని ఓ స్వర్గధామంలా మారుస్తున్నారు. కిచెన్, దేవుడి గది, బెడ్రూం, బాల్కనీ..హోమ్ థియేటర్ ఏర్పాటు.. ఇలా ప్రతి గదికి ఓ స్పెషాలిటీ ఉండేలా చూసుకుంటున్నారు. ఇక ఇంటిరీయర్ డిజైన్ విషయానికి వస్తే ఏకంగా లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఇంటిని ఓ స్వర్గంలా నిర్మించుకుంటున్నారు. ఇదే కోవలో కొంతమంది పొలిటీషియన్స్, వ్యాపారులు తమ కోసం ఓ గదిలో బార్ కౌంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇంటీరియర్ డిజైనర్లను పిలిపించుకుని నిర్మించుకుంటున్నారు. ఇటీవల నార్సింగిలోని ఓ విల్లాలో ఓ వ్యాపారి బార్‌ను పోలిన గదిని నిర్మించుకున్నాడు. నగరంలో ప్రతి ఒక్కరూ హోం బార్ కల్చర్‌ను ఇష్టపడుతున్నట్టు ఇంటీరియర్ డిజైనర్ రోహిత్ వర్మ తెలిపారు.
మహా నగరంలో..
మహానగరంలో ఆదిబట్ల, శంషాబాద్, బాచుపల్లి, శంకరపల్లి, శామీర్‌పేట్, మణికొండ, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, బోడుప్పల్, నాగోల్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కల్చర్ కనిపిస్తోంది. ప్రత్యేక ఇండ్లు, విల్లాలలో నివాసం ఉంటున్న వారు ఈ తరహా ఏర్పాట్లను చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రెంటెడ్, అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న వారిలో కొంతమంది తాము తక్కువ కాదన్నట్టుగా.. పెంట్‌హౌస్, మేడపై బార్ కౌంటర్లు తెరిచి మందును ఆస్వాదిస్తుండటం విశేషం.