Tamil Nadu : తమిళనాడులో విచిత్ర ఘటన జరిగింది. స్కూల్లో వంట మనిషిగా పనిచేస్తున్న తన భార్యను తొలగించినందుకు టీచర్లపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు, ఈరోడ్ జిల్లాలో ఇటీవల జరిగింది. జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆర్ముగం అనే వ్యక్తి భార్య వంట మనిషిగా పని చేసేది. అయితే, వంట సరిగ్గా చేయకపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం కారణంగా ఇటీవలే ఆమెను స్కూల్ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.
తన భార్యను వంట మనిషిగా తీసేసిన స్కూల్ సిబ్బందిపై ఆర్ముగం పగ పెంచుకున్నాడు. ఎలాగైనా, వారిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఒక ప్లాన్ రూపొందించి, అమలు చేశాడు. తమిళనాడు ప్రభుత్వ పాఠశాల్లో ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా సాంబార్ కూడా వడ్డిస్తుంటారు. గత ఆగష్టు 29న ఆర్ముగం తన ప్లాన్ అమలు చేసేందుకు గోవు పేడతో తయారైన పొడిని తీసుకెళ్లాడు. సాంబార్లో కలిపాడు. సాధారణంగా ప్రతి రోజూ ఉపాధ్యాయులు.. విద్యార్థులకు భోజనం వడ్డించేముందు దాని రుచి, నాణ్యత వంటివి పరిశీలించాలి.
వారు రుచి చూసి, ఆమోదించిన తర్వాత పిల్లలు కూడా అదే తింటారు. అయితే, టీచర్లు టేస్టు చేసేందుకు ఐటమ్స్‌ను ప్రత్యేకంగా తీసి ఉంచుతారు. ఆర్ముగం ఆ ప్రత్యేకంగా తీసిన వాటిలోనే సాంబార్ పౌడర్ బదులుగా గోవు పేడను కలిపాడు. ఎప్పట్లాగే టీచర్లు ఆ సాంబార్ టేస్ట్ చేశారు. గోవు పేడ పొడి కలవడంతో అది చేదుగా, విచిత్రంగా అనిపించింది. అయితే, పసుపు పొడి కాస్త ఎక్కువ కలపడం వల్ల అలా అయిందేమో అని టీచర్లు భావించారు. కానీ, అనుమానం వచ్చి పరిశీలించగా.. గోవు పేడ కలిసినట్లు తేలింది. ఇది చేసింది ఆర్ముగం అని గుర్తించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్ముగంను అరెస్టు చేశారు. అయితే, పిల్లల కోసం తయారు చేసిన సాంబార్లో గోవు పేడ పొడి కలపలేకపోవడం మంచిదైంది. పిల్లలు ఎవరికీ, ఎలాంటి హానీ కలగలేదు. టీచర్లు టేస్టు చేసే శాంపిల్‌లోనే అతడు ఆ పొడి కలిపాడు. దీంతో టీచర్లకే కాస్త ఇబ్బంది కలిగింది. దీంతో పిల్లలు సురక్షితంగా ఉన్నారు.