బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ కొత్త సినిమా ‘మిషన్ సిండ్రెల్లా’ నేరుగా ఓటీటీలో విడుదల కాబోతున్నది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ నాయికగా నటించింది. దర్శకుడు రంజిత్ తివారీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘బెల్ బాటమ్’ సినిమా తర్వాత రంజిత్ అక్షయ్ కుమార్‌తో తెరకెక్కించిన రెండో చిత్రమిది. ముందుగా థియేటర్లలో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను తాజాగా ఓటీటీకే పరిమితం చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఈ ఏడాది మేలో ‘మిషన్ సిండ్రెల్లా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో విజయాన్ని సాధించిన ‘రాత్ససన్’ సినిమా హిందీ రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. తెలుగులోనూ ‘రాక్షసుడు’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఇక్కడా మంచి విజయాన్ని సాధించింది. అక్షయ్ నటించిన మరో మూవీ విడుదల తేదీని ఖరారు చేసుకుంది. సామ్రాట్ ఫృథ్వీరాజ్ జీవిత కథతో తెరకెక్కిన ‘పృథ్వీరాజ్’ చిత్రాన్ని జూన్ 3న తెరపైకి తీసుకురానున్నారు. ఈ సినిమాలో మానుషీ చిల్లర్ నాయికగా నటించింది.