‘కమర్షియల్ సినిమా జీవితకాలం తొందరగా ముగుస్తుంది. కానీ తప్పొప్పుల్ని సరిదిద్దుకుంటూ కెరీర్‌ను అప్డేట్ చేసుకోవడం ఎలా అనేది వాణిజ్య ప్రధాన సినిమాల్లోనే ఎక్కువగా నేర్చుకుంటాం’ అని అన్నారు తమన్. తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం తమన్ జోరు కొనసాగుతున్నది. పలువురు అగ్రకథానాయకుల సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన స్వరాలను సమకూర్చిన తాజా చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ హీరోగా నటించారు. బోయపాటి శ్రీను దర్శకుడు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో తమన్ పాత్రికేయులతో పంచుకున్నముచ్చట్లివి…
‘అఖండ’ సినిమాలో సంగీతానికి ఎంతవరకు ప్రాధాన్యముంటుంది?
తెలుగు చిత్రసీమలో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులది విజయవంతమైన కాంబినేషన్. ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉంది కాబట్టే మంచి సినిమాలు చేయగలుగుతున్నారు. ఇందులో నాలుగు పాటలుంటాయి. తక్కువ సాంగ్స్ ఉండటం వల్ల బెటర్ అవుట్‌పుట్ ఇవ్వాలని ఎక్కువగా కష్టపడ్డా. సందర్భానుసారంగా వచ్చే పాటలన్నీ ఆకట్టుకుంటాయి.
కరోనా వల్ల ఎక్కువగా సమయం దొరకడంతో మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అనిపిస్తున్నది?
ప్రతి ఆరు నెలలకు ఒకసారి సినిమా తీరుతెన్నులు మారుతున్నాయి. వాటికి తగినట్లుగా మేము కరోనా గ్యాప్‌లో మ్యూజిక్ పరంగా కొన్ని మార్పులు చేశాం. భిన్న ఎమోషన్స్‌తో బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించారు. బాలకృష్ణ తన నటనతో అదరగొట్టాడు. కమర్షియల్ హంగులన్నీ సమపాళ్లలో కుదిరాయి. అభిమానులకు చక్కటి విందుభోజనంలా ఉంటుంది.
బాలకృష్ణ రెండు వేరియేషన్స్‌తో కూడిన పాత్రలో నటిస్తున్నారు. వాటికి తగినట్లుగా సంగీతాన్ని అందించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందా?
అఘోరా పాత్ర తాలూకు సన్నివేశాలకు మ్యూజిక్ అందించడానికి కొంత పరిశోధన చేశాం. అఘోరాల జీవితాలు ఎలా ఉంటాయో పుస్తకాలు చదివి తెలుసుకున్నాం. ఆ పాత్ర కనిపించే సందర్భాల్లో వచ్చే నేపథ్య సంగీతం కొత్తగా ఉంటుంది. అఘోరాలు వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటో తెలుసుకుంటూ ఆ సంగీతాన్ని అందించాం.
సినిమాకు సంగీతాన్ని సమకూర్చడంలో హీరో ఇమేజ్‌కు ఎంతవరకు ప్రాధాన్యమిస్తారు?
సినిమా కోసం మేము సమకూర్చిన సంగీతాన్ని శ్రోతల్లోకి హీరోలే తీసుకెళుతుంటారు. సంగీతదర్శకులకు, శ్రోతలకు మధ్య వారధిగా ఉంటూ మాకో ఐడెంటీటీ తీసుకొస్తున్నారు. హీరోలు లేకపోతే మేము లేము. . వారి ఇమేజ్ను అర్థంచేసుకుంటూ అందుకు తగినట్లుగా సంగీతాన్ని అందించడం చాలా ముఖ్యమని నేను నమ్ముతా.
సంగీత దర్శకుల మధ్య ఉండే పోటీని మీరు ఎలా స్వీకరిస్తారు?
నంబర్గేమ్స్ను నేను నమ్మను. అది మైండ్‌లో పెట్టుకుంటే కెరీర్లో ముందుకు సాగలేము. కష్టపడేతత్వమే ఇండస్ట్రీలో నిలబెడుతుందని నమ్ము తా.‘అల వైకుంఠపురములో’ తర్వా త సినిమాల విషయంలో సంగీత దర్శకుల బాధ్యత పెరి గింది. సినిమాకు ప్రేక్షకుల్ని ఆహ్వానించడానికి ఉపయోగపడే గ్రీటింగ్కార్డ్ల సంగీతం మారిపోయింది. ఆ బాధ్యతను దృషిలో పెట్టుకొని మంచి పాటలను అందివ్వడానికి ఆరోగ్యకరమైన రీతిలో సంగీత దర్శకులు పోటీపడుతున్నారు.
తదుపరి సినిమా విశేషాలేమిటి?
మహేష్‌బాబుతో చేస్తున్న ‘సర్కారువారిపాట’ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సినిమాకు సంబంధించి పాటల కంపోజింగ్ పూర్తయింది. బాలకృష్ణ తదుపరి సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నా. ‘భీమ్లానాయక్’లో పవన్‌కల్యాణ్‌తో ఓ పాటను పాడించాలనే ఆలోచన ఉంది. దాని గురించి త్వరలో చెబుతా.