న్యూఢిల్లీ, డిసెంబర్ 20: పనామా పేపర్స్ కేసులో నటి ఐశ్వర్యారాయ్ సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. అధికారులు ఆమెను 6 గంటల పాటు ప్రశ్నించారు. ఐశ్వర్య కొన్ని కీలక పత్రాలను అధికారులకు సమర్పించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘పనామా పేపర్స్’ కేసుకు సంబంధించి కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇటీవల ఐశ్వర్యకు సమన్లు జారీచేసిందని, ఈ నేపథ్యంలోనే ఆమె సోమవారం హాజరైనట్టు పేర్కొన్నాయి. పన్ను ఎగవేత, మనీలాండరింగ్, విదేశీ కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులకు పాల్పడిన ప్రముఖులు, సెలబ్రిటీలకు సంబంధించి 2016లో ‘పనామా పేపర్స్’ పేరిట ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) ఒక నివేదికను వెల్లడించింది. భారత్కు చెందిన 426 మంది ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇదే నా శాపం
ఐశ్వర్యారాయ్ అత్త, సమాజ్వాదీ ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో సహనం కోల్పోయారు. నార్కొటిక్ డ్రగ్స్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో తనను లక్ష్యంగా చేసుకొని ఓ సభ్యుడు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అధికారపక్షంపై విమర్శలు గుప్పించారు. ‘మీకు దుర్దినాలు రాబోతున్నాయి. మీకిదే నా శాపం’ అని విరుచుకుపడ్డారు.