న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎయిమ్స్-ఢిల్లీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా పిలుపునిచ్చారు. ‘బ్రిటన్‌లోని విషమ పరిస్థితులు దేశంలో రాకూడదని ఆశిద్దాం. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ కేసులు పెరిగినా.. క్షుణ్ణంగా పరిశీలించాలి. తదనుగుణంగా చర్యలు తీసుకొంటూ అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. కరోనా వైరస్ కట్టడికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల్లో కొన్ని మార్పులు చేస్తే కొత్త వేరియంట్ల నుంచి రక్షణ పొందొచ్చని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కొత్త వేరియంట్లు విరుచుకుపడే ప్రమాదమున్నదన్న నివేదికల హెచ్చరికలపై ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్యం, ప్రయాణాలు ప్రారంభమవ్వడమే కొత్త కేసులు పెరుగడానికి కారణంగా పేర్కొన్నారు.
ఎంఆర్ఎన్ఏ టీకా తెప్పించండి: గగన్‌దీప్ కాంగ్
బూస్టర్ డోసు కింద ఏ వ్యాక్సిన్‌ను ఇవ్వాలన్న అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, ప్రముఖ వ్యాక్సిన్ నిపుణురాలు డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బూస్టర్ డోసుగా ఎంఆర్ఎన్ఏ ఆధారంగా తయారు చేసిన టీకాలనే ఇవ్వాలని సూచించారు. అయితే దేశంలోని ప్రజలందరికీ బూస్టర్ డోసు ఇప్పుడు అవసరం లేదని, తొలుత 60 ఏండ్లు పైబడినవారికి, ఇతర అరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్ డోసు ఇవ్వాలన్నారు. ఫైజర్, మోడెర్నా టీకాలు ఎంఆర్ఎన్ఏ ఆధారంగా తయారుచేశారు. మహారాష్ట్రకు చెందిన జెన్నోవా ఫార్మా సంస్థ ఎంఆర్ఎన్ఏ ఆధారంగా ఓ టీకాను అభివృద్ధి చేస్తున్నది.
నాజల్ టీకా బూస్టర్ ట్రయల్స్‌కు అనుమతివ్వండి
ముక్కు ద్వారా వేసేందుకు తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘బీబీవీ154’ను బూస్టర్ డోసుగా వేయడంలో భాగంగా మూడో దశ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతినివ్వాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు భారత్ బయోటెక్ సోమవారం విజ్ఞప్తి చేసింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ఇదివరకే వేసుకొన్న వారికి బూస్టర్ డోసుగా ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
ఒమిక్రాన్ తీవ్రతపై ఆధారాలు లేవు: ఇన్సాకాగ్
ఒమిక్రాన్ వ్యాప్తి, రోగనిరోధక శక్తిని తప్పించుకోగలిగే సామర్థ్యం, తీవ్రతకు సంబంధించి ఇప్పటివరకైతే ఎలాంటి ఆధారాలు లేవని జీనోమిక్స్ కన్సార్టియమ్ (ఇన్సాకాగ్)తెలిపింది. ఇప్పటికే వైరస్ సోకడం, టీకా వేసుకోవడం వల్ల బాధితులపై కొత్త వేరియంట్ తీవ్రత తక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడింది.
161కి చేరిన ఒమిక్రాన్ కేసులు
భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 161కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ సోమవారం రాజ్యసభకు తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ ప్రభావంపై నిపుణులతో చర్చిస్తూ పర్యవేక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొత్త వేరియంట్ వ్యాప్తి చెందితే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని చెప్పారు. వ్యాక్సిన్లు సరిపడా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో నైట్ కర్వ్యూను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు గుజరాత్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
ఒమిక్రాన్‌కు ఐసీఎంఆర్ కిట్
ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే అత్యాధునిక కిట్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్)కు చెందిన డిబ్రూగఢ్‌లోని ప్రాంతీయ కేంద్రం పరిశోధకులు అభివృద్ధి చేశారు. రియల్ టైమ్ ఆర్టీ-పీసీఆర్ అస్సేగా పిలుస్తున్న ఈ కిట్ సాంకేతికత, మేధో సంపత్తి హక్కులు పూర్తిగా ఐసీఎంఆర్-డిబ్రూగఢ్ కేంద్రానికే చెందుతాయని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. సాంకేతికత బదిలీ, కిట్ అభివృద్ధి, విక్రయాల కోసం ఇన్ విట్రో డయాగ్నొస్టిక్స్ కంపెనీలు సంప్రదించవచ్చని సూచించింది.