Kevin Scott | న్యూఢిల్లీ : రానున్న ఐదేండ్లలో మొత్తం కోడింగ్‌లో 95 శాతం కృత్రిమ మేధ (ఏఐ) రాసినదే అవుతుందని మైక్రోసాఫ్ట్ సీటీఓ కెవిన్ స్కాట్ చెప్పారు. అత్యంత రొటీన్, లైన్-బై-లైన్ కోడింగ్ ఇక మాన్యువల్‌గా జరగదన్నారు. సంక్లిష్టమైన ఇంజినీరింగ్ సమస్యల పరిష్కారానికి, క్రియేటివ్ సొల్యూషన్స్‌ను రూపొందించడానికి మాత్రం హ్యూమన్ డెవలపర్స్ తప్పనిసరి అని ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఏఐ అనేది డెవలపర్లకు ప్రత్యామ్నాయం కాదని, అది వారిని మరింత వృద్ధి చేస్తుందని స్కాట్ చెప్పారు.
ఏఐ టూల్స్ వల్ల నాన్ టెక్ యూజర్లు సైతం అప్లికేషన్లు, వెబ్సైట్లను తయారు చేసుకోవడానికి అవకాశం వస్తుందన్నారు. అనుభవజ్ఞులైన ప్రోగ్రామర్లకు ఏఐ ఓ ఫోర్స్ మల్టిప్లయర్గా పని చేస్తుందని చెప్పారు. ప్రోగ్రామర్ల పనితీరు, సమర్థత, వేగం, విస్తృతిలను పెంచుతుందన్నారు.ఏఐ ప్రతి ఒక్కరి స్థాయిని పెంచుతుందని, డెవలపర్లు భవిష్యత్తులో బాయిలర్ ప్లేట్ కోడ్ కన్నా ఇన్నోవేషన్‌పై మరింత ఎక్కువ దృష్టి సారిస్తారని చెప్పారు. ప్రపంచంలో అత్యంత కఠినమైన కంప్యుటేషనల్ సమస్యలను పరిష్కరించాలంటే, కంప్యూటర్ సైంటిస్ట్‌ల అవసరం ఉంటుందన్నారు. ప్రారంభ అభివృద్ధి దశలలో యూఐ/యూఎక్స్, క్యూఏ వంటి ఇంటర్మీడియరీ రోల్స్ అవసరాన్ని తగ్గిస్తుందని చెప్పారు.