దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఇమిగ్రేషన్ కారిడార్‌ను ప్రారంభించారు. ఏక కాలంలో 10 మంది ప్రయాణికులు తమ పత్రాలను చూపవలసిన అవసరం లేకుండా, ఆగకుండా విమానం ఎక్కేందుకు వెళ్లవచ్చు. వేగంగా, సజావుగా, సురక్షితంగా ప్రయాణం జరగాలనే లక్ష్యంతో, ‘సరిహద్దులు లేని ప్రయాణం’ అనే వ్యూహంతో ఈ విధానాన్ని ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఏఐ కారిడార్. అత్యాధునిక బయోమెట్రిక్, ఏఐ టెక్నాలజీతో ఈ ఏఐ కారిడార్ పని చేస్తుంది. అప్పటికప్పుడు (రియల్ టైమ్) ఆటోమేటిక్‌గా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేస్తుంది. ప్రయాణికుడు ఇమిగ్రేషన్ చెక్‌పాయింట్ వద్దకు చేరుకోవడానికి ముందే అతని సమాచారాన్ని జత చేసి చూస్తుంది, తనిఖీ చేస్తుంది. దీనివల్ల ప్రయాణికులు తనిఖీల కోసం ఆగవలసిన అవసరం ఉండదు. ఈ విధానం ఎంత వేగంగా పని చేసినప్పటికీ, భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదు. అనుమానాస్పద పాస్‌పోర్టులను తనిఖీల కోసం ఆటోమేటిక్‌గానే ఫోర్జరీ ఎక్స్పర్ట్లకు పంపిస్తుంది.