న్యూఢిల్లీ, జనవరి 30: కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం పెరిగిపోతున్న కారణంగా భారతీయ టెక్ పరిశమ్రలో మానసిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఓ నివేదిక పేర్కొన్నది. రెస్ట్ ఆఫ్ వరల్డ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌లోని ఐటీ ఉద్యోగుల్లో ఏఐ తీవ్ర ఆందోళనను సృష్టిస్తున్నది. కఠినమైన పని గంటలతో కలిపి ఇది ఆత్మహత్యల వైపు ఐటీ ఉద్యోగులను పురిగొల్పుతున్నది. మరణాలపై స్పష్టమైన డాటా అందుబాటులో లేనప్పటికీ, ఏఐ చాలా ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టించిందని నిపుణులను ఉటంకిస్తూ నివేదిక పేర్కొన్నది.
స్థానిక వార్తా కథనాలను విశ్లేషించిన రెస్ట్ ఆఫ్ వరల్డ్.. 2017, 2025 మధ్య 227 మంది భారతీయ టెకీల ఆత్మహత్య కేసులు నమోదైనట్లు గుర్తించింది. వీరిలో చెన్నైలో పనిచేస్తున్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన 48 ఏండ్ల మేనేజర్ కూడా ఉన్నారు. పని ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అదే విధంగా పుణెలో ఓ 36 ఏండ్ల ఐటీ ఉద్యోగి నదిలో దూకాడు. ఐటీ కంపెనీ యాజమాన్యంపై మృతుడి సోదరి ఫిర్యాదు చేసింది. పని ఒత్తిడి తట్టుకోలేక మరో 38 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనకు తాను కరెంట్ షాక్ పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదిక పేర్కొన్నది.
ఏఐ కారణంగా తమ ఉద్యోగాల స్థిరత్వం గురించి టెక్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఐఐటీ-ఖరగ్‌పూర్‌కు చెందిన సీనియర్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ జయంత ముఖోపాధ్యాయ్ రెస్ట్ ఆఫ్ వరల్డ్‌కి తెలిపారు. ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీలు ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన చెప్పారు. ఎంట్రీ లెవల్ జాబ్స్ అత్యధిక ముప్పును ఎదుర్కొంటున్నాయని నివేదిక తెలిపింది. కేవలం భారతీయ ఐటీ పరిశ్రమ మాత్రమే ఈ పరిస్థితిని ఎదుర్కోవడం లేదని, అమెరికా టెక్ రంగం 2025లో 1.50 లక్షల ఉద్యోగులపై వేటు వేసిందని నివేదిక పేర్కొన్నది.
కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు వంటి ఉద్యోగాలు మొదట పోతాయని కార్నెల్ యూనివర్సిటీ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆదిత్య వశిష్ఠ తెలిపారు. సంప్రదాయ ఉత్పాదక తయారీ కంపెనీలతో పోలిస్తే సేవా రంగంలో సంప్రదాయ కన్సల్టింగ్ పాత్ర అధికంగా ప్రభావితం అవుతుందని ఆయన చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో టీసీఎస్ దాదాపు 20,000 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసిందని, ఇందుకు ఏఐ ఒత్తిడి, అమెరికా-భారత్ వాణిజ్య బంధాలు ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొన్నది.
2026 మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల సంఖ్యలో 2 శాతం మందిని తొలగించాలని టీసీఎస్ యోచిస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగంలో ఉన్నవారు నిరంతరం తమ ఉద్యోగాలు కోల్పోయే ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నారని నివేదిక తెలిపింది. ఈ ఆందోళనే కొందరిలో ఆత్మహత్యకు పురిగొల్పుతున్నదని రెస్ట్ ఆఫ్ వరల్డ్ తెలిపింది. ఏఐపై ఆధారపడిన కొత్త ప్రపంచాన్ని స్వీకరించేందుకు సిద్ధపడిన వారు సైతం భవిష్యత్తులో ఉద్యోగ ముప్పును ఎదుర్కోక తప్పదని నివేదిక అంచనా వేసింది.