– సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు
జూలూరుపాడు, మే 30 : దేశంలోని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు పూర్తిగా అప్పగించడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకు వస్తోందని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. జూలూరుపాడు మండల పరిధిలోని వీరభద్రపురం గ్రామంలో కామ్రేడ్ కల్తీ రామన్న అధ్యక్షతన శనివారం జరిగిన మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వ్యవసాయ రంగాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయంపై రైతాంగానికి ఉన్న హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో రైతులు పత్తి వంటి పంటలను ఎంత మేర సాగు చేయాలి, ఏయే పంటలు పండించాలనే విషయాలను సైతం అమెరికా కనుసన్నల్లోనే మోదీ ప్రభుత్వం మన దేశ రైతులపై రుద్దుతోందని ధ్వజమెత్తారు.
దేశంలో రైతాంగం ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ఈ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలు మార్కెట్లో తడిసిపోతున్నా, నిల్వ చేసుకునే సదుపాయాలు లేక, మద్దతు ధర లభించక కొనే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైఫల్యం వల్లే రైతులు తమ పంటను దళారీలకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితిని ప్రభుత్వమే కల్పిస్తోందని, దళారీ వ్యవస్థను కేంద్రం పెంచి పోషిస్తోందని విమర్శించారు. ఈ మహాసభ ప్రారంభానికి ముందు కామ్రేడ్ కల్తీ రామన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కామ్రేడ్ వల్లోజు రమేష్ అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, కార్యదర్శి నివేదికను బి.గోపి సభ ముందుంచారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కామ్రేడ్ వల్లోజు రమేష్ మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీన బూర్గంపాడు మండలం సారపాకలో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు రైతు కూలీలు, ప్రజాస్వామ్యవాదులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు కల్తీ నరసింహారావు, కల్తీ రామన్న, ఐఎఫ్టీయూ నాయకులు కూరాకుల నరసింహారావు, లిక్కి నరేష్, కల్తీ సురేష్, కల్తీ లక్ష్మయ్య, జాతర నరసింహారావు పాల్గొన్నారు.