లక్నో, జనవరి 1: నూతన సంవత్సర వేళ యూపీలో దారుణం చోటు చేసుకుంది. లక్నోలో 24 ఏండ్ల యువకుడు తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హోటల్ గదిలో హత్య చేశాడు. అనంతరం తానే వారిని హత్య చేసినట్టు వీడియో విడుదల చేశాడు. ఆగ్రాకు చెందిన మహమ్మద్ అర్షద్ తన తల్లి ఆస్మాతో పాటు చెల్లెళ్లు అల్షియా (19), రహిమీన్ (18), ఆక్స (16), అలియా (9)లను బుధవారం హోటల్ షరంజిత్లో హత్య చేశాడు. తన స్వస్థలమైన బుదౌన్‌లోని తన సగం ఇంటిని పొరుగున ఉండే వ్యక్తులతో పాటు, ల్యాండ్ మాఫియా స్వాధీనం చేసుకుని తమను వెళ్లగొట్టారని, తనను, తండ్రిని తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నిం చారని, బంగ్లా దేశీయులుగా ముద్ర వేశారని ఆరోపించాడు.
పైగా తన చెల్లెళ్లను హైదరా బాద్‌లో అమ్మేయడానికి ప్రయత్నించారని, అలా జరగకూడదని భావించి నిస్సహాయ స్థితిలో తన తండ్రి సహకారంతో తల్లి, నలుగురు చెల్లెళ్లను హత్య చేసినట్టు నిందితుడు ఆ వీడియోలో పేర్కొన్నాడు. తాను కూడా త్వరలోనే ప్రాణం తీసుకుంటానని ఆ వీడియో లో చెప్పాడు. వారి శవాలను చూపిస్తూ వారి గొంతు నులిమి, మణికట్టును కోసి చంపినట్టు తెలిపాడు. గత 15 రోజులుగా తాము ఫుట్‌పాత్‌పై పడుకుంటున్నామని, చలిలోనే గడుపుతున్నామని వాపోయాడు. తమ ఇంటి స్థలాన్ని దేవాలయ నిర్మాణానికి ఇవ్వాలని, తమ ఇంట్లోని వస్తువులను అనాథాశ్రమానికి ఇవ్వాలని కోరాడు. తమ మరణం తర్వాతైనా కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేశాడు. వీడియోలో తనను వేధించిన వ్యక్తుల పేర్లను పేర్కొన్నాడు. కాగా, ఘటనా స్థలిలోనే నిందితుడిని అరెస్ట్ చేశామని సెంట్రల్ లక్నో డిప్యూటీ పోలీస్ కమిషనర్ రవీన త్యాగి తెలిపారు.