హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ సాగుతున్న వేళ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజుల పంజా విసురుతున్నాయి. విద్యార్థులపై అదనపు భారం మోపుతున్నాయి. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల నుంచి వివిధ పేర్లతో వేలాది రూపాయల ఫీజులను అదనంగా వసూలు చేస్తున్నట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎక్స్ట్రా, స్పెషల్ ఫీజుల పేరిట వసూలు చేస్తూ రశీదులు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇక కొన్ని కాలేజీలు కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.
ఇంతకాలం బీ క్యాటగిరి సీట్ల వ్యాపారం యాజమాన్యాల పంట పండించింది. ఇప్పుడు అడ్మిషన్ ఫీజుల పేరిట కొత్త దందాకు కాలేజీలు తెరలేపాయి. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిబంధనల ప్రకారం విద్యార్థి నుంచి రూ. 5,500 మాత్రమే ఫీజుగా తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలేవి ఆయా కాలేజీలు పట్టించుకోవడం లేదు.
అడ్మిషన్ ఫీజులను ఆదాయ వనరుగా మలుచుకుంటున్నాయి. ఈ అడ్మిషన్ ఫీజుల పేరిట కోట్లు దండుకుంటున్నట్టు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 60 సీట్లున్న ఒక బ్రాంచీలోనే రూ. 30లక్షల వరకు వసూలు చేశారని చెబుతున్నారు. అంటే కాలేజీలో కొత్తగా 500 మంది చేరితే రూ.2.2కోట్లు వసూలు అవుతున్నట్టు లెక్క. నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్కూల్స్ అండ్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ డిమాండ్ చేశారు.