ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ శైలజ
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 14 : ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని మున్సిపల్ కమిషనర్ శైలజ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 16న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్, తెలంగాణ చౌక్, కలెక్టర్ చౌక్ మీదుగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు 15 వేల మంది జాతీయ జెండాలతో ర్యాలీ చేపడుతామన్నారు. అనంతరం స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి వార్డు నుంచి 150 మంది వచ్చేలా కౌన్సిలర్లు కృషి చేయాలని, అందుకు జెండాల పంపిణీ పూర్తి చేస్తున్నామని వివరించారు. ఈ నెల 17వ తేదీన 16 బస్సుల్లో హైదరాబాద్‌లో నిర్వహించే సభకు గిరిజనులను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలు, నాయకులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు బండారి సతీశ్, భరత్, అశోక్ స్వామి, అజయ్, సంజయ్, రాజు,సాయి తదితరులు పాల్గొన్నారు.
భాగస్వాములు చేయాలి
బోథ్, సెప్టెంబర్ 14 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వాములు చేయాలని ఐకేపీ ఏపీఎం మాధవ్ సూచించారు. మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో సీసీలు, వీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన బోథ్‌లో నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీ చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి గ్రామం నుంచి సంఘాల సభ్యులను ర్యాలీకి తీసుకురావాలన్నారు. సమావేశంలో సీసీలు గంగాధర్, సంజీవ్, లక్ష్మయ్య, సుభద్ర, పోసాని, విజయలక్ష్మి, శకుంతల, మౌనిక, వీవోఏలు, సిబ్బంది పాల్గొన్నారు.