ఆదిలాబాద్, జూలై 1 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ పగటికలలు కంటున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జాతీయ పార్టీలు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తాయని, బీజేపీ మాత్రం తెలంగాణలో అమలవుతున్న పథకాలకు భయపడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న హైదరాబాద్‌లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి ప్రధాని మోదీతో పాటు కమలం పార్టీ నాయకుల్లో వణుకుపుడుతున్నదని, కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగల నాయకుడన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోతుందన్న భయంతో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలో తరచూ పర్యటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని, జాతీయ కార్యవర్గ సమావేశాలకు జనాన్ని రప్పించడానికి రాష్ట్రంలో గల్లీగల్లీలో ఆ పార్టీ జాతీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు తమవని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, వాటిని నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటు సరిగా జరగలేదని చేసిన వ్యాఖ్యలు ప్రజలకు గుర్తుందన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, విభజన హామీలతో పాటు పలు విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణి అవలంబిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న ప్రధాని మోదీకి ఇక్కడ పర్యటించే హక్కు లేదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే తమకు పుట్టగతులు ఉండవనే భయంతో బీజేపీ నాయకులు రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారని, ఆ నాయకులు వెకిలి చేష్టలను మానుకోవాలని సూచించారు.
సీసీఐని తెరిపించాలి..
వేలాది మందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మూతపడిన సిమెంట్ పరిశ్రమను తెరిపించాలంటూ ప్రజలు, సీసీఐ సాధన సమితి, భూ నిర్వాసితులు, ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఆందోళనలు, దీక్షలు చేస్తున్నా మోదీ ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్‌తో పాటు రాష్ట్ర నాయకులు తమ నాయకులను ఒప్పించి సీసీఐని తెరిపించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆదిలాబాద్‌లో కేంద్రీయ విద్యాలయానికి పదెకరాల స్థలాన్ని కేటాయించి ఆరేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ర్టానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను కేంద్రం కేటాయించాలని ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రహ్లాద్, నాయకులు గంగారెడ్డి, సంజయ్, అజాజ్, శివకుమార్ పాల్గొన్నారు.
ప్రజల గురించి ఆలోచించే పార్టీ టీఆర్ఎస్..
ఆదిలాబాద్ రూరల్, జూలై 1 : పేదల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జైనథ్ మండలం యువకులు పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పేదల కోసం దేశంలో ఎక్కడాలేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ఎమ్మెల్యే పుట్టిన రోజు పాటల సీడీ ఆవిష్కరణ..
ఈ నెల 4న ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టిన రోజు సందర్భంగా వైస్‌ఎంపీపీ గంగారెడ్డి సమక్షంలో తయారు చేసిన పాటల సీడీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని వివరిస్తూ పాటలు రూపొందించారు. ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం, హరితహారం కార్యక్రమాల నిర్వహణకు కార్యకర్తలు, నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.