ఎదులాపురం, ఫిబ్రవరి 23 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని, అన్ని రకాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్‌లీల మైదానంలో బుధవారం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలతోపాటు సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా, పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎకరం భూమిని కేటాయించడం జరిగిందని, త్వరలోనే భవన నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. బంజారా, లంబాడీల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవాలాల్ మహరాజ్ అడుగు జాడల్లో నడవాలన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ వేడుక నిర్వహించేందుకు మూడు వారాల కిందనే నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బంజారాలు చేసిన నృత్యాలు ఆకట్ట్టుకుంన్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జడ్పీటీసీలు చారులత, అనిల్ జాదవ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు జాదవ్ రమేశ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ పవార్, ప్రధాన కార్యదర్శి జాదవ్ బలిరాం, సలహాదారులు రూపావత్ అమర్‌సింగ్, జావన్ వినాయక్‌రావు, రాథోడ్ హరాలాల్ నాయక్, రాథోడ్ సురేశ్ నాయక్, కోశాధికారి సుభాష్ నాయక్ పాల్గొన్నారు.