
‘ఒమిక్రాన్’ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఓ వైపు వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నది. ఈ మేరకు మాస్కులు తప్పనిసరని, ధరించని వారికి రూ. 1000 జరిమానా విధించాలని పోలీసు, ఇతర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నియంత్రలోనే ఉండగా, మూడో దశ ప్రచారం నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నది. కాగా, ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం సీఎస్ సోమేశ్‌కుమార్ పర్యటించనున్నారు.
ఆదిలాబాద్, డిసెంబరు 2 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా రెండోదశ తీవ్ర ప్రభావం చూపింది. అయితే ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో దాని ప్రభావం క్రమంగా తగ్గింది. అంతేగాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టడంతో ఆరు నెలలుగా కరోనా నియంత్రణలో ఉంది. రోజు ఐదారు కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం 80 శాతం మంది మాస్కులు ధరించడం లేదు. దీంతో వైరస్ ప్రబలే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ ప్రచార నేపథ్యంలో ప్రజలందరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ధరించని వారికి పోలీసులు, ఇతర శాఖల అధికారులు గుర్తించి రూ. వేయి జరిమానా విధించనున్నారు.
వందశాతం వ్యాక్సినేషన్ దిశగా..
ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ తక్కువగా ఉండడంతో ప్రభుత్వం టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందు లో భాగంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. వైద్యశాఖ, మెప్మా, డీఆర్డీవో, అంగన్వాడీ సిబ్బంది పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ అర్హులకు టీకా ఇస్తున్నారు. వారి వివరాలను వెంటనే కొవిన్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. పట్టణాల్లోని వార్డుల్లో, గ్రామాల్లో ప్రత్యేక వైద్యబృందాలు వ్యాక్సినేషన్ చేస్తున్నాయి. వీరితో పాటు మొబైల్ టీంలను ఏర్పాటు చేసి మొదటి డోస్ తీసుకున్న వారిని గుర్తించి గడువు లోగా రెండో డోస్ ఇస్తున్నా రు. రోజు 10 వేల నుంచి 12 వేల మందికి టీకా ఇచ్చేలా ప్రణాళికలు తయారు చేశారు. ఈ నెల 31 లోగా ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా అధికారులు చర్య లు తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టరేట్ సమావేశ మం దిరంలో ఉమ్మడిజిల్లాలోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులతో వ్యాక్సినేషన్‌పై సమీక్షించనున్నారు.