
యాసంగి వరి సాగుపై ఢిల్లీ.. గల్లీ బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. వడ్లు కొనబోమంటూ కేంద్ర సర్కారు చెబుతుండగా, యాసంగిలో వరి సాగు చేయాలంటూ రాష్ట్ర నేతలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ధాన్యం కొంటరా.. కొనరా అంటూ మూడు రోజులుగా పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఒంటరి పోరాటం చేస్తున్నా కాంగ్రెస్, బీజేపోళ్లు కనీసం నోరుమెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రైతు సమస్యలు పట్టవా అంటూ రైతు బంధు సమితులు, రైతు సంఘాలు మండిపడుతూ ప్రశ్నిస్తున్నాయి.
ఆదిలాబాద్, డిసెంబర్ 2 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతు సమస్యలపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు అలుపెరుగని పోరాటం చేస్తుంటే.. ఢిల్లీ బీజేపీ నాయకులు ఒకదారి, గల్లీ నాయకులు మరోదారి చూసుకుంటున్నారు. దీనికితోడు కాంగ్రెస్ ఎంపీలు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో వడ్లు కొనుగోలు చేసేదీ లేదని తెగేసీ చెప్పడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వానకాలంలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. గ్రామాల్లోనే కాంటాలు ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా మద్దతు ధర చెల్లించి కొంటున్నది. యాసంగిలో సాగు చేసిన వరిని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర మంత్రులు, అధికారులను కోరినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఇతర రాష్ర్టాల్లో వరిని కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో మాత్రం వడ్ల్లు కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేసేలా టీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై పోరాటాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలు విషయంలో అనుకూలమైన ప్రకటన చేయాలంటూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మూడ్రోజులుగా గులాబీ పార్టీ ఎంపీలు అలుపెరుగని పోరాటం చేస్తున్నా కేంద్ర మంత్రుల నుంచి స్పందన కనిపించడం లేదు.
పత్తాలేని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు..
రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడాల్సిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు వడ్ల కొనుగోళ్ల విషయంలో పత్తాలేకుండా పోతున్నారు. తెలంగాణలో వడ్ల కొనుగోళ్లకు సంబంధించి పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలతో కలిపి పోరాటం చేయాల్సిన రెండు పార్టీల ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు సమస్యలపై పార్లమెంట్లో కనీసం మాట్లాడడం లేదు. వడ్లను కొనబోమని కేంద్ర సర్కార్ తెగేసి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం రైతులను పక్కదారి పట్టిస్తున్నారు. యాసంగిలో వరి సాగుచేయాలంటూ అన్నదాతలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు మాయమాటలు చెబుతున్న కమలం పార్టీ నేతలు ఢిల్లీలో తమ మంత్రుల ముందు కనీసం మాట మాట్లాడకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర సర్కారు తెలంగాణలో రైతులు సాగు చేసిన వడ్లను కొనుగోలు చేసేలా రాష్ట్ర బీజేపీ నాయకులు తమ పార్టీ మంత్రులపై ఒత్తిడి తీసుకురావాలని సూచిస్తున్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో ఆందోళన చేస్తున్న బీజేపీ ఎంపీలకు తమ మద్దతు ఉంటుందని రైతులు అంటున్నారు.
నోరు మెదపని జిల్లా బీజేపీ నాయకులు
జిల్లాలో వరిధాన్యాన్ని పండించే రైతుల పక్షాన మాట్లాడడానికి జిల్లాలోని ఒక్క బీజేపీ నాయకుడికీ నోరు కదలడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై కల్పితాలతో అభాసుపాలు చేయడం తప్పా రైతులకు మేలు చేసేలా మాట్లాడడం లేదని రైతు సంఘాల నాయకులు బీజేపీ నాయకులపై మండిపడుతున్నారు. ఇటీవల కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ఒక ధర్నా కార్యక్రమంలో జిల్లా బీజీపీ ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులపై సానుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తున్నదని అన్నారు. కానీ రైతులు పండించిన వరిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బహిరంగ ప్రకటన చేయలేకపోయారు. ఎంతసేపు రైతులను పక్కదారి పట్టించడం, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం తప్పా బీజీపీ నాయకులు గాని, ప్రభుత్వం గాని రైతులకు ఏనాడూ మేలు చేయలేదని జిల్లా రైతు బంధు సమితి నాయకులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కొంటారా? లేదా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలుపై రైతులు ఎంత ఆందోళన చేస్తున్నా బీజేపీ నాయకులు పట్టనట్లు ఉంటున్నారు. ధాన్యం కొనుగోలుపై రైతులు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆందోళనను తప్పుదారి పట్టిస్తున్న బీజీపీ నాయకులు రైతుల విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతుల కోసం కలిసి రావాలి
కుంటాల, డిసెంబర్ 2 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు శాపంగా మారుతున్నాయి. మూడు రోజులుగా పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు రైతుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ రైతుల పక్షాన కలిసి రాకపోవడం బాధాకరం. ఇప్పటికైనా తెలంగాణ రైతుల పక్షాన పోరాడుతున్న టీఆర్ఎస్ ఎంపీలతో గొంతు కలిపి మాకు న్యాయం చేయాల్సిన అవసరం జిల్లా ఎంపీపై ఎంతైనా ఉంది.
ధాన్యం కొనాల్సిందే..
కుంటాల, డిసెంబర్ 2 : తెలంగాణ రైతులు పండిస్తున్న వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనాలి. యాసంగిలో ధాన్యం కొనేదిలేదంటున్న కేంద్ర సర్కారు తీరు తెలంగాణ రైతాంగాన్ని తీవ్రంగా బాధిస్తున్నది. అన్నదాతల పక్షాన దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా కొట్లాడుతున్న టీఆర్ఎస్ ఎంపీల పోరాట పటిమ అభినందనీయం. కేంద్రం రైతులకు అన్యాయం చేస్తే ఉద్యమాలు తప్పవు. రైతుల పక్షాన నిలబడని బీజేపీ ఎంపీలను నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వడ్లు కొనాల్సిందే.