యాదాద్రి భువనగిరి, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : రామన్నపేటలో ఏర్పాటు చేయాలనుకున్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. దానిస్థానంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. శనివారం రాత్రి యాదాద్రి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం తమ నిర్ణయాన్ని తెలిపారు. రామన్నపేటలో డ్రైపోర్టు పేరుతో రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి.. ఆ తర్వాత అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ భావించింది.
దీన్ని రామన్నపేటతోపాటు చుట్టుపక్కల గ్రా మాల ప్రజలు వ్యతిరేకించారు. ప్రజా సమస్యను నమస్తే తెలంగాణ అక్షరబద్ధం చేసింది. నిత్యం కథనాలు ప్రచురించి అక్షర కవాతుగా నిలిచింది. కేటీఆర్‌తోపాటు అనేక మంది ప్రముఖులు స్పందించేలా చేసింది. అదానీ తమ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో రామన్నపేటతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆపత్కాలంలో అండగా నిలిచిన నమస్తే తెలంగాణ దినపత్రికకు రామన్నపేటవాసులు కృతజ్ఞతలు తెలిపారు.