Rajinikanth | సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్‌ను అందుకున్న స్టార్ హీరో వెంకటేష్.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తనకున్న అనుబంధాన్ని తాజాగా పంచుకున్నారు. ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన ఆధ్యాత్మిక చింతన గురించి, సినీ ప్రయాణంలో రజనీకాంత్ ఇచ్చిన విలువైన సలహా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
వెంకటేష్ మాట్లాడుతూ “రజనీకాంత్‌కు, నాకు ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువ. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మా నాన్నగారితో కలిసి ఆయన పనిచేశారు. నేను చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చిన సమయంలో ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు. సినిమా విడుదల సమయంలో బ్యానర్లు కట్టారా? పోస్టర్లలో మన ముఖం బాగా కనిపిస్తుందా? మ్యాగజైన్ ముఖచిత్రంపై మన ఫోటో వేశారా? వంటి విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించవద్దని ఆయన సూచించారు. మనం మన పని చేసుకుంటూ నిశ్శబ్దంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. అప్పటినుంచి నేను ఆయన చెప్పిన ఆ సలహానే పాటిస్తున్నాను. ప్రచార ఆర్భాటాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. దేని గురించీ ఎక్కువగా ఆలోచించను” అని అన్నారు.
అంతేకాకుండా, ఇదే ఇంటర్వ్యూలో వెంకటేష్ తనకు అరుణాచలం అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. రమణ మహర్షిని తాను ఎంతగానో ఆరాధిస్తానని చెప్పారు. చిన్నప్పటి నుంచే తనకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువుగా ఉండేవని ఆయన వెల్లడించారు. దేవుడంటే తనకు చాలా భయమని, భగవంతుడికి సంబంధించిన అనేక పుస్తకాలు చదివినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక సందర్భంలో, ‘ఘర్షణ’ సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయిందని, దేవుడి దయ వల్లే ఎలాంటి ప్రమాదం జరగకుండా తాను సురక్షితంగా బయటపడ్డానని వెంకటేష్ ఆనాటి భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
Still living by Rajini Sir’s words of wisdom 💫 – Actor Venkatesh @VenkyMama ❤️❤️#SuperstarRajinikanth #50YearsOfRajinism
— R 🅰️ J (@baba_rajkumar) April 29, 2025