Mahesh Babu | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు డుమ్మాకొట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీకి మహేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు గాను ఈ నెల 22న మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నోటీసుల ప్రకారం, మహేశ్ బాబు ఈరోజు ఉదయం 10:30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, నిర్ణీత సమయం ముగిసినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు.
ఇదిలావుంటే తాజాగా మహేశ్ బాబు ఈడీ విచారణకు హాజరుకాకపోయినందుకు లేఖ రాశాడు. ఈ లేఖలో ప్రస్తుతం తాను సినిమా షూటింగ్లో బిజీగా ఉండి విచారణకు హాజరుకాలేకపోయానని మహేశ్ వెల్లడించాడు. రేపు కూడా షూటింగ్ బిజీలో ఉండడంతో విచారణకు మరో తేదీని ఇవ్వాలని మహేశ్ లేఖలో కోరాడు.
అసలు ఏం జరిగిందంటే..
సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీల ప్రమోషన్ కోసం మహేశ్ బాబు చెక్కుల రూపంలో రూ. 3.4 కోట్లు, నగదు రూపంలో రూ. 2.5 కోట్లు కలిపి మొత్తం రూ. 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారని, ప్రమోషన్ల పేరుతో భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 22న మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది.