న్యూఢిల్లీ: సేల్స్ ట్యాక్స్ ఇచ్చిన నోటీసుల్ని ప్రశ్నిస్తూ నటి అనుష్కా శర్మ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ట్యాక్స్ నోటీసులో చాలా ఎక్కువ స్థాయిలో పన్ను అంశాన్ని పేర్కొన్నట్లు ఆమె వెల్లడించారు. సేల్స్ ట్యాక్స్ డిప్యూటీ కమీషనర్ ఇచ్చిన రెండు నోటీసులను సవాల్ చేస్తూ ఆమె బాంబే హైకోర్టుకు వెళ్లారు. అనుష్కా చేసిన అభ్యర్థనపై స్పందించాలని సేల్స్ ట్యాక్ శాఖను ధర్మాసనం ఆదేశించింది. జడ్జిలు నితిన్ జామ్దార్, అభయ్ అహుజాలు ఈ తీర్పును ఇచ్చారు. మళ్లీ ఫిబ్రవరి ఆరో తేదీన ఈ కేసును విచారించనున్నారు.
సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని అనుష్కా కోర్టును కోరారు. నటిగా మాత్రమే తనపై పన్ను వేయాలని, కానీ అధిక రేటుతో తనకు పన్ను వేసినట్లు ఆమె ఆరోపించారు. గతంలో 2012, 2016లో అనుష్కా ఈ అంశంపై నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు. గత డిసెంబర్లో ట్యాక్స్ కన్సల్టెంట్ ఇచ్చిన ఆదేశాలను కొట్టి వేయడంతో ఆమె మళ్లీ కొత్తగా పిటిషన్ వేశారు.
నటిగా కాకుండా వాణిజ్య ఉత్పత్తుల్ని ప్రమోట్ చేసినందుకు ట్యాక్స్ విధించడం సరికాదు అని ఆమె వాదించారు. 2012-13 ఏడాదికి 1.2 కోట్లు చెల్లించాలని నోటీసు వస్తే, ఆ తర్వాత ఏడాది మళ్లీ 1.6 కోట్ల నోటీసు వచ్చినట్లు ఆమె తెలిపారు. పన్ను అంచనా వేసే అధికారి తప్పుగా అధిక రేటును వేశారని తన పిటిషన్లో అనుష్కా తెలిపారు.