మహేశ్వరం అక్టోబర్ 24 : ప్రభుత్వ భూములను కబ్జాకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ లో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెల రోజుల్లో నెరవేర్చుతానని చెప్పి.. ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి.. ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు బంధు, మహిళలకు ఇస్తన్న రూ.2500లు ఎప్పుడు ఇస్తారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాల్య వివాహాలను నిర్మూలించడానికే కల్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చిందని, 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పడంతో చాలా మంది అమ్మాయిలకు 18 ఏండ్లు నిండిన తర్వాత పెండ్లీలు చేస్తున్నారని తెలిపారు. అప్పటినుంచి అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారని తెలిపారు. ఫాక్స్ఖాన్ లాంటి కంపెనీలు రావడంతో తుక్కుగూడ ప్రాంతంలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో తుక్కుగూడ మరో హైటెక్ సిటీగా మారబోతుందన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కృషితోనే అనేక కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చాయన్నా రు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కో సం గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.270 కోట్లు నిధులను నిలిపివేశారని, దీం తో పనులు మధ్యంతరంగా ఆగిపోయాయన్నారు. కార్యక్రమంలో చైర్మన్ కాటేకార్ మధుమోహన్, మహేశ్వరం తాసీల్దార్ సైదులు, వైస్ చైర్మన్ భవానీ వెంకట్ రెడ్డి, కమిషనర్ వెంకట్ ట్రామ్ రెడ్డి, కౌన్సిర్లు రవినాయక్, యాదగిరిరెడ్డి, సుమన్, తేజస్వీని శ్రీకాంత్ గౌడ్, విలాస్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, సల్మాన్ రాజు పాల్గొన్నారు.
మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఒక విజన్‌తో చెరువులను అభివృద్ధి చేయించారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడలో ఉన్న రావిర్యాల చెరువును గురువారం ఆమె పరిశీలించారు. చెరువు చుట్టూ తిరిగి సుందరీకరణ పనులను పరిశీలించారు. చెరువు కట్టపై ఇంకా చేయవలసి న పనుల గురించి అధికారులతో చర్చించి..సుందరీకరణ మ్యాప్‌ను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మిషన్ కాకతీయ పథకం ద్వార చెరువుల్లో పూడిక తీయడం జరిగిందన్నారు. గతంలో రావిర్యాల చెరువును సుందరీకరణ చేయడానికి రూ.7 కోట్లు కేటాయించిందని అని అన్నారు. గౌడన్నల కోసం చెరువు కట్టపై 700 ఈత చెట్లు నాటించాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకట్ ట్రామ్, ఏఈ శివకుమార్ రెడ్డి, కౌన్సిలర్ రవినాయక్, సుమన్, లక్ష్మయ్య, సామెల్ రాజ్, బాట సురేశ్, తదితరులు ఉన్నారు.