AP Deputy CM Pawan Kalyan | ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం, ఉగ్రవాద చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సమయంలో మౌనంగా ఉండడం మంచిందని తెలిపాడు. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయోన్సర్లతో పాటు తప్పుడు పోస్టులు పెట్టే ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చాడు.
సైన్యం యుద్ధం చేస్తున్న సమయంలో పౌరులుగా దేశ ప్రజలందరూ తమ వంతు పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారిని ఎదుర్కోవాలని, వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని, సైబర్ క్రైమ్ విభాగాలకు సమాచారం అందించి వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరైనా దేశ వ్యతిరేకంగా, యుద్ధానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని, దేశంపై బయటి నుండి లేదా లోపలి నుండి ఎలాంటి దాడి జరిగినా తీవ్రంగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు దేశ భద్రత గురించి అవగాహన లేకుండా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయవద్దని ఆయన సూచించారు. దేశ సరిహద్దులను ఎలా కాపాడాలో వారికి తెలియదని, కాబట్టి జాతీయ భద్రత గురించి తెలియకుండా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయవద్దని ఆయన అన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.