సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 30: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామంలో ఆరేండ్ల చిన్నారిపై రాధారపు శంకర్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడటం అమానుష చర్యగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ ఇంచార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. శనివారం సిరిసిల్లలో మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు శంకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తప్పుచేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన శంకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు రైతు బంధు సమితి మండల కన్వీనర్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ అరుణ తదితరులు పాల్గొన్నారు.