Acer TravelLite Essential Series | తక్కువ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన బడ్జెట్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఏసర్ ఓ నూతన ల్యాప్ టాప్‌ను లాంచ్ చేసింది. ట్రావెల్ లైట్ ఎసెన్షియల్ సిరీస్ పేరిట ఈ ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు లభించడంతోపాటు ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ప్రయాణాలు ఎక్కువగా చేసే వారి కోసం సౌకర్యవంతంగా ఉండేలా ఈ ల్యాప్ టాప్‌ను తీర్చిదిద్ది అందిస్తున్నారు. అందువల్ల చాలా సులభంగా ఈ ల్యాప్ టాప్‌లను ఎక్కడికండే అక్కడికి తీసుకెళ్లవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ల్యాప్ టాప్ కేవలం 1.34 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో తీసుకెళ్లడం తేలికవుతుంది. ఈ ల్యాప్ టాప్‌ను రెండు వెర్షన్లలో అందిస్తున్నారు.
ఈ ల్యాప్ టాప్ ఇంటెల్ కోర్ ఐ5-1334యు లేదా ఏఎండీ రైజెన్ 5 7430యు ప్రాసెసర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల ఐపీఎస్ యాంటీ గ్లేర్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. కనుక ల్యాప్ టాప్ డిస్ప్లే అద్భుతమైన క్వాలిటీని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ల్యాప్‌టాప్ కు ఉన్న హింజ్లను 180 డిగ్రీల కోణంలో తిరిగేలా అమర్చారు. కనుక డిస్ప్లేను కావల్సిన కోణంలో అమర్చుకుని పనిచేసుకోవచ్చు. ఈ ల్యాప్ టాప్ ఏకంగా 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 36 వాట్ అవర్ 3 సెల్ లిథియం అయాన్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్‌కు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. అందువల్ల ల్యాప్ టాప్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ ల్యాప్‌టాప్‌కు ఉన్న హెచ్డీ వెబ్ కెమెరాకు ప్రైవసీ షటర్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. డ్యుయల్ స్టీరియో స్పీకర్లను ఇచ్చారు. అందువల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. వైఫై 6, బ్లూటూత్ 5.2, హెచ్డీఎంఐ, యూఎస్బీ టైప్ సి, టైప్ ఎ, మైక్రో ఎస్డీ కార్డ్ రీడర్, 2 ఇన్ 1 ఆడియో కోంబో జాక్ వంటి కనెక్టివిటీ సదుపాయాలను ఇందులో అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ లో ఉన్న ర్యామ్‌ను 32జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే 1టీబీ వరకు కెపాసిటీ ఉన్న ఎస్ఎస్డీలకు ఇది సపోర్ట్‌ను అందిస్తుంది. డిఫాల్ట్ గా 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో ఈ ల్యాప్‌టాప్ లభిస్తుంది. ప్రత్యేకంగా గ్రాఫిక్ కార్డు అంటూ ఏమీ లేదు. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్కు 1 ఏడాది పాటు వారంటీ లభిస్తుంది.
ఏసర్ ట్రావెల్ లైట్ ఎసెన్షియల్ సిరీస్ ల్యాప్ టాప్కు చెందిన ఏఎండీ రైజెన్ ప్రాసెసర్ మోడల్ ధర రూ.32,999 ఉండగా, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ మోడల్ ధర రూ.36,500గా ఉంది. ఈ ల్యాప్ టాప్‌ను ఆబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్లో లాంచ్ చేశారు. ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌తోపాటు, ఆథరైజ్డ్ రీసెల్లర్స్, ఏసర్ ఆన్లైన్ స్టోర్లలో ఈ ల్యాప్ టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రయాణాల్లో ల్యాప్ టాప్‌లను ఎక్కువగా వాడే వారి కోసం ఈ ల్యాప్ టాప్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.