Blood Moon | ఖగోళ ప్రియులకు గుడ్‌న్యూస్. వచ్చే నెల సెప్టెంబర్ 7న అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపురంగులో మెరిసిపోనున్నాడు. దీన్ని బ్లడ్‌మూన్’గా పిలుస్తారు. భారతదేశం సహా ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. అమెరికా ఖండంలో మాత్రం గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ చంద్రగ్రహణం ఏ ఏడాది రెండోది కావడం విశేషం. తొలి చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడగా.. అది భారత్‌లో కనిపించలేదు. సెప్టెంబర్ 7న జరగబోయే గ్రహణం దేశంలో చాలాచోట్ల స్పష్టంగా కనిపించనున్నది. దాంతో సూతకాలం వర్తిస్తుందని జ్యోతిషపండితులు పేర్కొంటున్నారు. గ్రహణం నేపథ్యంలో ఆలయాలు మూతపడనున్నాయి.
సెప్టెంబర్ 7న పెనుంబ్రల్ గ్రహణం రాత్రి రాత్రి 8:58 గంటలకు ప్రారంభమవుతుంది. పాక్షిక చంద్రగ్రహణం రాత్రి 9:57 గంటలకు మొదలవుతుంది. ఇక సంపూర్ణ గ్రహణం రాత్రి 11:30 గంటలకు మొదలవుతుంది. గరిష్ఠ గ్రహణం అర్ధరాత్రి 12.11 గంటలకు దర్శనమిస్తుంది. సంపూర్ణ సూరగ్రహణం రాత్రి 12:52 గంటలకు పూర్తవుతుంది. పాక్షిక గ్రహణం తెల్లవారు జామున 1:56 గంటలకు, పెనుంబ్రల్ గ్రహణం ఉదయం 2:55గంటలకు ముగుస్తాయి. మొత్తం గ్రహణ దశలు కలిపితే 5.27గంటలు ఉంటుంది. సంపూర్ణ గ్రహణం 82 నిమిషాలు ఉంటుంది.
సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఎరువు వర్ణంలోకి మారిపోనున్నాడు. భూమి నీడ (ఉంబ్రా)లో పూర్తిగా చంద్రుడు ఉంటాడు. ఈ సమయంలో భూమి వాతావరణం సూర్యకాంతిని వడపోస్తుంది. ఎరుపు రంగు కాంతి మాత్రమే చంద్రుడిపై పడుతుంది. దాంతో చంద్రుడు ఎరుపుగా కనిపిస్తాడు. దీన్నే బ్లడ్‌మూన్‌గా పిలుస్తారు. ఈసారి చంద్రుడి గ్రహణ తీవ్రత (magnitude) 1.362గా ఉండడంతో చంద్రుడు మరింత లోతుగా భూమి నీడలోకి వెళ్లి, మామూలు కన్నా బాగా ఎరుపు రంగులో మెరుస్తాడని నిపుణులు చెబుతున్నారు.
ఈ సారి ఈ గ్రహణం భారతదేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో సంపూర్ణంగా చూడవచ్చు. బ్యాంకాక్, బీజింగ్, హాంగ్‌కాంగ్, సిడ్నీ వంటి నగరాల్లోనూ మొత్తం గ్రహణ దశలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో చంద్రుడు నెమ్మదిగా ఎరుపు రంగులోకి మారతాడు. ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చని నిపుణులు తెలిపారు. నేరుగా కళ్లతో నేరుగా చూసినా ఎలాంటి సమస్య ఉండదని.. ఇందులో అతినీల లోహిత కిరణాలు ఉండవు, కావున స్పెషల్ గ్లాసులు అవసరం లేదని చెబుతున్నారు.
గ్రహణం నేపథ్యంలో భారత్‌లోని ఆలయాలు మూసివేయనున్నారు. సూతకాలం కారణంగా పూజలు, శుభకార్యలు జరుగవు. పండితుల అభిప్రాయం ప్రకారం ఇది ‘రాహుగ్రస్త చంద్రగ్రహణం’ కావడంతో రాహు-కేతు శాంతి పూజలు, హనుమంతుడికి ప్రత్యేక పూజలు, విష్ణు సహస్రనామం, దుర్గ చాలీసా వంటి మంత్రపఠనాలు శుభప్రదమని పండితులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో ఆహారం, పానీయాలు తీసుకోకూడదని.. గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి శుద్ధి జరుపుకోవడం, దానాలు చేయడం శుభప్రదంగా తెలిపారు.