OnePlus Pad 3 | వన్‌ప్లస్ సంస్థ వన్‌ప్లస్ ప్యాడ్ 3 పేరిట ఓ నూతన ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత మార్కెట్లో లేటెస్ట్గా లాంచ్ చేసింది. ఈ ట్యాబ్‌ను గతంలోనే అనౌన్స్ చేసినప్పటికీ భారత మార్కెట్లో మాత్రం తాజాగా విడుదల చేశారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌లో13.2 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 2కె రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ట్యాబ్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అమర్చారు. 16 జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ప్రత్యేకంగా వేపర్ చాంబర్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ట్యాబ్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ హీట్‌కు గురి కాదు. ఎక్కువ సేపు వాడుకోవచ్చు.
ఈ ట్యాబ్‌కు 8 స్పీకర్లను ఏర్పాటు చేశారు. వాటిల్లో 4 మిడ్ బేస్ యూనిట్స్ కాగా 4 ట్వీటర్లు ఉన్నాయి. ఇవి అద్భుతమైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ఈ ట్యాబ్‌లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌ను ఇతర డివైస్‌లకు కనెక్ట్ చేసి చాలా సులభంగా ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్‌కు వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. 5.97 ఎంఎం మందంతో అత్యంత స్లీక్ డిజైన్‌ను ఈ ట్యాబ్ కలిగి ఉంటుంది. దీన్ని పూర్తిగా మెటల్‌తో రూపొందించారు. కనుక ట్యాబ్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. ఈ ట్యాబ్‌లో 12140 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ట్యాబ్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 92 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ పూర్తవుతుంది. 10 నిమిషాల పాటు చార్జ్ చేస్తే ట్యాబ్‌లో 18 శాతం బ్యాటరీ పవర్ పెరుగుతుంది.
ఈ ట్యాబ్‌కు గాను అప్‌గ్రేడెడ్ కీబోర్డును ఏర్పాటు చేశారు. ఇది పీసీ స్టైల్లో ఉంటుంది. ఏఐ కోసం ప్రత్యేకంగా ఓ బటన్‌ను అందిస్తున్నారు. ఈ కీబోర్డును 110 నుంచి 165 డిగ్రీల కోణంలో మలుచుకోవచ్చు. అందువల్ల చాలా సౌకర్యవంతంగా దీనిపై టైప్ చేయవచ్చు. ఈ ట్యాబ్ కు ఎన్ఎఫ్సీ సదుపాయం కూడా లభిస్తుంది. 12జీబీ, 16జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఇందులో సపోర్ట్ లభిస్తుంది. వైఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, 5జి షేరింగ్ వంటి సదుపాయాలను సైతం అందిస్తున్నారు.
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను స్టార్మ్ బ్లూ, ఫ్రాస్టెడ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ట్యాబ్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.47,999 ఉండగా, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.52,999గా ఉంది. ఈ ట్యాబ్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వన్ ప్లస్ ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో సెప్టెంబర్ 5 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సంద్భంగా ఈ ట్యాబ్‌పై ఆఫర్లను సైతం అందిస్తున్నారు. వన్‌ప్లస్ స్టైలో 2, వన్ ప్లస్ ప్యాడ్ 3 ఫోలియో కేస్‌ను రూ.7,198కి పొందవచ్చు. పలు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో ఈ ట్యాబ్‌ను కొంటే రూ.5వేల బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ట్యాబ్‌పై 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం అందిస్తున్నారు.