K218B | ఈ బ్రహ్మండంలో భూమి కాకుండా మరెక్కడైనా జీవం ఉందా? అని శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతున్నారు. ఎక్కడో ఒక చోట జీవం ఉండే ఉంటుందని భావిస్తున్నారు. ఆ జీవం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు గ్రహాలతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉన్న నక్షత మండలాలను సైతం పరిశీలిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు జీవం ఆనవాళ్లు మాత్రం దొరకలేదు. ఏళ్లుగా జీవం ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకబోతున్నది. తాజాగా శాస్త్రవేత్తలకు కీలక సమాచారం దొరికింది. జేమ్స్‌వెబ్ టెలీస్కోప్ కీలక సమాచారాన్ని అందించింది. సూర్యుడికి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కే218బీ అనే గ్రహం వాతావరణంలో శాస్త్రవేత్తలను పరిశీలించారు.
ఇక్కడ ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ గ్రహంలో డైమెథైల్ సల్ఫైడ్ (DMS), డైసల్ఫైడ్ (DMDS) అనే రసాయనాలు ఉన్నట్లుగా గుర్తించారు. భూమిపై ఇవి దాదాపు పూర్తిగా జీవక్రియ ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని.. ముఖ్యంగా అల్గే వంటి సూక్ష్మ జీవుల ద్వారా ఉత్పత్తి అవుతుంటాయని పేర్కొంటున్నారు. ఈ గ్యాస్‌లు జీవం ఉన్నదానికి సాక్ష్యం కాదు కానీ.. బలమైన సంకేతాలుగా పరిగణించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది జీవం ఉందన్న భావనకు బలమైన సంకేతాలని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ పేర్కొన్నారు. ఆయన ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఈ గ్యాస్‌లు భూమిపై ఉన్న స్థాయికంటే వేల రెట్లు కేంద్రీకృతమై ఉన్నాయని పేర్కొన్నారు. కే2-18బీ గ్రహం భూమికన్నా 2.5రెట్లు పెద్దగా ఉండగా.. ఇది హ్యాబిటబుల్ జోన్లో (జలరూపం ఉండే అవకాశం ఉన్న ప్రాంతం) పరిభ్రమిస్తోందని.. అంటే అక్కడ ద్రవజల రూపంలో నీరు ఉండే అవకాశం ఉందని.. ఇది జీవం ఏర్పడటానికి అవసరమైన మౌలిక ప్రమాణాల్లో ఒకటి పేర్కొంటున్నారు.
అయితే, పలువురు శాస్త్రవేత్తలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. జేమ్స్‌వెబ్ టెలీస్కోప్ సేకరించిన డేటాను మళ్లీ విశ్లేషించిన కొన్ని బృందాలు.. ఈ గ్యాస్‌ల ఉనికిపై స్పష్టత ఇంకా తక్కువగానే ఉందని అభిప్రాయపడ్డారు. ఇది ఆ దిశలో ఒక అడుగు మాత్రమేనని.. పూర్తి ఆధారంగా చెప్పలేమని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన డాక్టర్ డేవిడ్ క్లెమెంట్స్ పేర్కొన్నారు. జీవం ఉందని ప్రకటించడానికి శాస్త్రవేత్తలు ‘ఫైవ్ సిగ్మా థ్రెషోల్డ్’ అని పిలవబడే, 99.99999 శాతం విశ్వాసం సాధించాల్సి ఉంటుందని.. ఈ దశలో ఏ ఆధారాలు పూర్తిగా నిర్దారించబడి ఉన్నాయని చెప్పలేమని పేర్కొంటున్నారు. మరో వైపు జేమ్స్‌వెబ్ టెలీస్కోప్ ఇంకా మరికొన్ని పరిశోధనలు చేపట్టనున్నారు. త్వరలో మరో సెట్ డేటా అందుబాటులోకి రానుందని.. రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా సంకేతాలతో నిర్ధారించగలమని భావిస్తున్నట్లుగా మధుసూదన్ వివరించారు.