ఎదులాపురం : యువతిని పెళ్లి ( Marriage ) చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసి మోసం చేసిన వ్యక్తికి 3 సంవత్సరాల కఠిన కారాగార జైలు( Prison ) శిక్ష, రూ.8 వేలు జరిమానా విధిస్తు మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ పి.శివరామ్ ప్రసాద్ తీర్పును వెల్లడించారు. కోర్టు లైజన్ అధికారి జి. పండరి తీర్పునకు సంబంధించిన వివరాలను తెలిపారు.
నార్నూర్ మండలంలోని బాబేఝరి గ్రామానికి చెందిన యువతితో బేల మండలంలోని సాంగ్వి పాఠాగూడకు చెందిన కినక జల్పత్ రావు(25)తో పరిచయం అయింది. ఆమెకు మాయమాటలు చెప్పిపెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. కొన్ని రోజులకు తనను పెళ్లి చేసుకోవాలని అడుగగా అతడు తిరస్కరించి ఆమె గర్భం తో సంబంధంలేదని మోసం చేశాడు. దీంతో 2017 జూన్ 5న నార్నూర్ పోలీస్ స్టేషన్ బాధిత యువతి ఫిర్యాదు చేసింది.
అప్పటి ఎస్సై కె శ్రీకాంత్ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువతి పాపకు జన్మనివ్వడంతో డీఎన్ఏ పరీక్ష జరిపి కినక జల్పత్ రావు తండ్రిగా నిర్ధారణ అయిందన్నారు. ఛార్జిషీట్ దాఖలు చేయగా లైజన్ ఆఫీసర్ జి. పండరి, కోర్టు డ్యూటీ పోలీస్ అధికారి జాదవ్ శ్రీనివాస్ 10 మంది సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంజయ్ కుమార్ వై.రాగరే నేరాన్ని రుజువు చేయించగా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ పి. శివరామ్ ప్రసాద్ తీర్పును వెలువరించారు.
ముద్దాయికి (మూడు) సంవత్సరముల కఠిన కారాగార శిక్ష, రూ. 8వేలు జరిమానా విధించారు. బాధ్యుతారాలికి రూ. 5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించారు. నిందితుడికి శిక్ష పడడంలో పోలీసు యంత్రాంగం సాక్షులను ప్రవేశ పెట్టడంలో, కేసు విచారణ చేయడంలో, కృషి చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు.