పెన్పహాడ్, మార్చి 08 : పెన్పహాడ్ మండల కేంద్రంలో ఈ నెల 5న జరిగిన మహిళ హత్య కేసులో శనివారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ జి.రాజశేఖర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. పెన్పహాడ్కు చెందిన మామిడి రాములు తండ్రి పాపయ్య అనే వ్యక్తికి, అదే గ్రామానికి చెందిన మచ్చ మట్టమ్మ (60) కు మధ్య గత 25 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. కాగా రాములు మట్టమ్మకు ఓ బంగారు గొలుసు ఇచ్చాడు. కొంతకాలం తర్వాత అంతే విలువ గల డబ్బులు ఇస్తానని చెప్పి అట్టి బంగారం గొలుసు తీసుకుని ఇంత వరకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న రాత్రి సమయంలో మట్టమ్మను ఇంటిలోకి పిలుపించుకుని డబ్బుల గురించి అడిగి కొట్టి నెట్టివేశాడు. దీంతో మట్టమ్మ మెడకు బలమైన గాయం కావడంతో ఈ నెల 5న సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మట్టమ్మ మృతిచెందింది. శనివారం సీఐ జి.రాజశేఖర్ ఆదేశాల ప్రకారం ఎస్ఐ గోపికృష్ణ తన సిబ్బందితో నిందితుడు మామిడి రాములు తన ఇంటి వద్ద ఉండగా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు