గద్వాల అర్బన్ : బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. అయితే సదరు అధికారి తనకు బదిలీ వేటు పడకుండా ప్రజాప్రతినిధులు ఆశ్రయించడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. గద్వాల జిల్లా ( Gadwal ) కేటిదొడ్డి పోలీస్ స్టేషన్లో (KT Doddi Police Station ) విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి తీరు మొదటి నుంచి వివాదస్పదంగా ఉంటూ వస్తుంది.
ఇటీవల ఆయన వ్యవహారం మితిమీరి పోవడంతో విషయం జిల్లా బాస్‌కు చేరింది. జిల్లా బాస్ అతడిపై ఆరా తీసి బదిలీ వేటుకు సిద్ధమయినట్లు సమాచారం . మండలంలో మట్టి, ఇసుక, బియ్యం మాఫియాలతో ఉన్న సంబంధాలపై స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆరా తీసి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
సివిల్ పంచాయతీలతో పాటు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ జల్సాలు చేస్తున్నాడని సర్వత్రా ఆరోపణలు జిల్లా బాస్‌కు చేరాయి. స్టేషన్లో పని చేసే సిబ్బందిని సదరు అధికారి వేధిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ పోలీసు అధికారిపై జిల్లా బాస్ సీరియస్ అయినట్లు తెలిసింది. తనను బదిలీ చేసే అవకాశాలున్నాయని తెలుసుకున్న అధికారి ఖద్దర్ నాయకుల శరణుజొచ్చినట్లు సమాచారం .
బుధవారం జిల్లాలో పర్యటించిన ఓ అధికార పార్టీ నాయకుడిని రహస్యంగా కలిసి తనకేమి కాకుండా పావులు కదిపినట్లు బయటకు పొక్కడంతో డీఎస్పీ మొగిలయ్య స్పందించారు. సదరు పోలీస్ స్టేషన్ అధికారి వ్యవహరం శైలీ సమాచారం తమ వద్ద ఏమి లేదని వివరించారు.