హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసుశాఖలో అతిపెద్ద అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఓ డీఎస్పీ స్థాయి అధికారి ఏకంగా రూ.300 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టడం చూసిన ఏసీబీ అధికారుల కండ్లు బైర్లు కమ్మాయి. ఆయన అక్రమాస్తులు లెక్క కట్టేందుకు ఒకరోజు సరిపోలేదు. దీంతో ఆయన అక్రమాస్తులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు మళ్లీ శుక్రవారం రంగంలోకి దిగను న్నారు. తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డిపై అవినీతి నిరోధకశాఖ గురిపెట్టింది. ఆయన తన సర్వీసు కాలంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే పకా సమాచారంతో ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేశారు. భీమ్‌రెడ్డి నివాసంతోపాటు బంధువులు, స్నేహితులు, బినామీల నివాసాలపై లసోదాలు చేపట్టారు.
పోలీస్‌శాఖలో 1989లో కానిస్టేబుల్‌గా చేరిన భీమ్‌రెడ్డి 1995లో ఎస్సైగా ఉద్యోగోన్నతి పొందారు. అనాటి నుంచి ఆయన అక్రమంగా సంపాదిస్తూనే ఉన్నారని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. 2010లో ఇన్స్పెక్టర్గా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత ఆయన అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని పలువురు బాధితులు చెప్తున్నారు. మొత్తం సైబరాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోనే విధులు చేపట్టారని చెప్తున్నారు. విధులు చేపట్టిన ప్రతి చోటా అక్రమంగా సంపాదించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి ప్లాట్లు, ఫ్లాట్లూ తమ బంధువులు, స్నేహితుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించడం అతనికి వెన్నెతో పెట్టిన విద్యగా చెప్తున్నారు. అందుకే ఆయన పేరు మీద ఒక్కటంటే ఒక్క ఆస్తి కూడా లేదని, అన్నీ బినామీల పేరుమీదే ఉన్నాయని తెలిసింది. ప్రస్తుతం 10 మంది బినామీలను గుర్తించామని, మరికొందరు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భీమ్‌రెడ్డికి.. బీజేపీ నేత, మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్‌చైర్మన్ కే నరేందర్‌రెడ్డితో వ్యాపార సంబంధం ఉన్నదని ఏసీబీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అక్కడ ఆయన వాంగ్మూలం తీసుకోగా.. మరికొన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. వీరిద్దరూ, మరికొందరు కలిసి బెంగళూరు, కర్ణాటకల్లో భూములు కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. రెండేండ్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నా.. ఆయన పేరున ఆస్తులు ఉన్నట్టు సరైన ఆధారాలు లేక ఏసీబీ ఇన్నిరోజులు ఆగినట్టు తెలిసింది. అక్రమాస్తుల కేసుల్లో నిందితులను తక్షణం అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరుపరిచే ఏసీబీ అధికారులు.. భీమ్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
1)హైదరాబాద్ ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా.
2) టెలికాంనగర్‌లో జీ+2 +పెంట్ హౌస్ గల నివాస భవనం.
3) టెలికాం నగర్‌లోని సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్.
4) గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్స్‌లో ఒక ఫ్లాట్.
5) మణికొండ లాంకో హిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల జీ+5 వాణిజ్య సముదాయంలో వాటా.
6) మణికొండ మర్రిచెట్టు జంక్షన్లో 3వేల చదరపు అడుగుల వాణిజ్య స్థలం.
7) తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు.
8) ప్రగతి రిసార్ట్స్ వద్ద 500 చదరపు గజాల ఖాళీ స్థలం.
9) సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి.
10) కర్ణాటకలో ఆరెకరాల వ్యవసాయ భూమి.
11) కర్ణాటకలోనే మరో 38 ఎకరాల వ్యవసాయ భూమి.
12) దేవనహళ్లిలో ఎకరం భూమి
13) నాగోల్‌లో కామినేని దవాఖాన సమీపంలో 200 చదరపు గజాల స్థలం.
14) పటాన్చెరులో జీపీఆర్ హౌసింగ్ సొసైటీ వద్ద 400 చదరపు గజాల స్థలం.
15) పటాన్చెరులో 200 చదరపు గజాల మరో స్థలం.
16) వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 1,000 చదరపు గజాల భూమి.
17) మోమిన్‌పేటలో 2 ఎకరాల వ్యవసాయ భూమి.
18) రాఘవేంద్ర రాక్‌సాండ్ మినరల్స్ సంస్థలో రూ.75 లక్షల పెట్టుబడి.
19) రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి.
20) ఇంట్లో రూ.3.60 లక్షల నగదు
21) ఆయన బినామీ నివాసంలో రూ.40 లక్షల నగదు స్వాధీనం
22) సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం
23) సుమారు 20 కిలోల వెండి వస్తువులు స్వాధీనం
24) సుమారు రూ.19.91 లక్షల బ్యాంకు నిల్వలు గుర్తింపు
26) విదేశీ మద్యం బాటిళ్లు 23