సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): స్కామ్‌లు, సంచలనాలకు నిలయమైన నిలోఫర్ దవాఖానలో మరో కుంభకోణం బయటపడింది. రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అందించే ఫ్రెష్ ఫ్రొజెన్ ప్లాస్మా (ఎఫ్ఎఫ్పీ) నిలోఫర్ బ్లడ్ బ్యాంక్‌లో నుంచి మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. సుమారు రూ.80 లక్షల విలువ చేసే ఎఫ్ఎఫ్పీని నిలోఫర్ బ్లడ్ బ్యాంక్‌కు చెందిన కొందరు ఇంటి దొంగలు దవాఖాన గడప దాటించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి దవాఖానకు చెందిన కొందరు సిబ్బంది కూడా సహకరించినట్లు తెలిసింది. సాధారణంగా ఎఫ్ఎఫ్పీని తీవ్ర రక్తస్రావమయ్యే రోగులకు రక్తం గడ్డ కట్టడం కోసం ఇస్తారు.
ముఖ్యంగా ప్రసవం సమయంలో తీవ్ర రక్తస్రావం అయ్యే మహిళలకు దీని అవసరం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో నవజాత శిశువులకు సైతం ఎఫ్ఎఫ్పీ అత్యవసరం. ఇది ఇతర బ్లడ్ కాంపోనెంట్స్ కంటే కొంత ఖరీదైనది. వివిధ అనారోగ్య సమస్యలతో నిలోఫర్‌లో చేరిన రోగులకు అవసరమైనప్పుడు ఎఫ్ఎఫ్పీని అందిస్తారు. అయితే ఈ మధ్య అవసరమున్న రోగులకు ఎఫ్ఎఫ్పీ కోసం వైద్యులు రెఫర్ చేస్తే దవాఖానలోని బ్లడ్‌బ్యాంక్‌లో ఎఫ్ఎఫ్పీ కొరత ఉందని తేలింది.
దీంతో రోగులు బయట నుంచి వేల రూపాయలు వెచ్చించి ఎఫ్ఎఫ్పీని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణంగా బ్లడ్ బ్యాంక్ నుంచి ఏవైన బ్లడ్ కాంపోనెంట్స్‌ను రోగులకు అందచేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అక్కడి రికార్డుల్లో పొందుపర్చాలి. ఏ రోగికి ఏ కాంపోనెంట్ ఇస్తున్నారు? ఎంత పరిమాణం ఇస్తున్నారో పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ దవాఖానలోని బ్లడ్ బ్యాంక్‌లో భద్రపరిచిన ఎఫ్ఎఫ్పీ ఎక్కడ మాయమైందో సరైన రికార్డులు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లడ్ బ్యాంక్‌లో నిలువ చేసిన ఎఫ్ఎఫ్పీని ఎంత మంది రోగులకు ఇచ్చారు? ఏయే రోగులకు ఇచ్చారో సరైన వివరాలు లేవనే వదంతులు వినిపిస్తున్నాయి.
త్రి సభ్య కమిటీతో విచారణ
వైద్య సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న డీఎంఈ, బ్లడ్ బ్యాంక్ నుంచి మాయమైన ఎఫ్ఎఫ్పీ ఉదంతంపై విచారణ జరపాల్సిందిగా దవాఖాన సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. డీఎంఈ ఆదేశాల మేరకు దవాఖాన సూపరింటెండెంట్ డా. విజయ్‌కుమార్ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో చిన్నపిల్లల విభాగాధిపతి, గైనకాలజి విభాగాధిపతితో పాటు సీఎస్ ఆర్ఎంవో ఉన్నారు. అయితే గత మూడు నాలుగేళ్లుగా ఇక్కడి బ్లడ్ బ్యాంక్‌లో నుంచి ఎఫ్ఎఫ్పీ మాయమవుతున్నట్లు తెలిసింది.
ఇప్పటి వరకు దాదాపు రూ.80 లక్షలకు పైగా విలువైన ఎఫ్ఎఫ్పీ మాయమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో కూడా నిలోఫర్‌లో పలు రకాల స్కాంలు జరిగిన విషయం తెలిసిందే. గతంలో అక్రమంగా ప్రైవేటు వ్యక్తులతో మెడికల్ షాపు నిర్మించడం, ఆరోగ్యశ్రీ విభాగంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా కొందరికి వేతనం పెంచడం, ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు ఇవ్వాల్సిన ట్రాన్స్పోర్ట్ చార్జీలు వంటివి వారికి ఇవ్వకుండా నొక్కేయడం తదితర స్కాంలు జరిగిన విషయం తెలిసిందే.
నిలోఫర్ సూపరింటెండెట్పై వేధింపు ఆరోపణలు
సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖాన సూపరింటెండెంట్ డా.విజయ్‌కుమార్‌పై వేధింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు అధికారి అయినదానికి, కానిదానికి అనవసరంగా వైద్యాధికారులు, సిబ్బందిపై నోరు పారేసుకుని వారిని మానసికంగా వేధిస్తున్నాడని దవాఖాన సిబ్బంది ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం నియోనాటల్ విభాగానికి చెందిన ఓ వైద్యురాలితో సూపరింటెండెంట్ డా.విజయ్‌కుమార్ ఇష్టానుసారంగా మాట్లాడడంతో మానసిక ఒత్తిడికి గురైన వైద్యురాలు అస్వస్థతకు గురై దవాఖానలోనే కిందపడిపోయినట్లు తెలిసింది.
బాధితురాలిని చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించినట్లు సమాచారం. కాగా జరిగిన ఉదంతంపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో రకరకాల వదంతులు ప్రచారమయ్యాయి. స్పందించిన బాధిత వైద్యురాలు మాట్లాడుతూ ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, నిన్న కొంత అలసటకు గురయ్యానని, తానే ఏ దవాఖానలో చేరలేదని, కొంత విశ్రాంతి తీసుకుంటున్నాని, రెండు మూడు రోజుల్లో కోలుకుని, విధులకు హాజరవుతానంటూ ఒక వీడియోను విడుదల చేసింది.
అయితే బాధిత వైద్యురాలు తాను ఆరోగ్యంగా ఉన్నట్లు మాత్రమే వివరణ ఇచ్చారు. కాని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతున్న సూపరింటెండెంట్ వేధింపులపై మాట్లాడక పోవడంతో ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. గతంలో కూడా వరంగల్‌లోని ఎంజీఎంలో పీడియాట్రిక్ విభాగాధిపతిగా పనిచేస్తున్న సమయంలో కూడా డా.విజయ్‌కుమార్‌పై సంబంధిత విభాగానికి చెందిన వైద్యుల బృందం వేధింపులకు గురిచేస్తున్నట్లు అప్పటి డీఎంఈ డా.రమేశ్‌రెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ కోరేందుకు నమస్తే తెలంగాణ ప్రయత్నించగా సూపరింటెండెంట్ స్పందించలేదు.