హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : ‘ఒక్క మార్పుతో మీ జీవితాలు మార్చుకోండి. మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మేమంతా మంచి చేస్తాం.. అంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు, తీరా అధికార పీఠమెక్కాక మంచి పనులు మానేసి.. ముంచే పనులు చేస్తున్నారు. గారడీ మాటలు, భ్రమలతో అంతా కనికట్టు చేస్తున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అభివృద్ధి పథంలో దూసుకుపోయిన రాష్ర్టాన్ని ఇప్పుడు అధోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్ర విద్యారంగమే ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నది. విద్యారంగాన్ని సంస్కరిస్తామంటూ అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్, అధికారం చేజిక్కించుకున్నాక అంతా గోల్మాల్ చేస్తున్నది. ప్రభుత్వ విద్యకు పాడె కడుతూ ఏకంగా వేల బడులను ఎత్తివేసే కుట్రకు పూనుకున్నది’.
‘మూతబడ్డ స్కూళ్లను తెరుస్తాం.. సింగిల్ టీచర్ స్కూళ్లను కొనసాగిస్తాం.. ఈ స్కూళ్లకు అదనంగా మరో టీచర్ను కేటాయిస్తాం.. మెగా డీఎస్సీ పేరిట 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం’ అని అనేక హామీలిచ్చారు. మ్యానిఫెస్టో పేరిట మాయాజాలం చేశారు. తీరా పీఠమెక్కాక విద్యావ్యవస్థ సవ్యంగా లేదన్నారు. తీరా ఇప్పుడు అదే బడులను మూసివేయబోతున్నారు. ఇచిన హామీలన్నింటినీ అటకెక్కించారు. ‘టీచర్లకు జీతాలెక్కువున్నాయి.. మొత్తం బడ్జెట్ టీచర్ల జీతాలకే పోతున్నది.. టీచర్లు రాజకీయాలు చేస్తున్నారు.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తక్కువవున్నారు.. అంటూ పలుమార్లు ప్రభుత్వ పెద్దలు మాటలు చెప్పారు. తీరా ఇప్పుడు ఒకటో, రెండో కాకుండా ఏకంగా 23 వేల స్కూళ్లను మూసివేయబోతున్నారు.
రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టింది. ఈ లెక్కన ఏటా రూ.45వేల కోట్లను కేటాయించాలి. కానీ, ఈ రెండున్నరేండ్ల కాలంలో విద్యకు కేటాయించిన నిధులు కేవలం రూ.21వేల కోట్లు మాత్రమే. రేవంత్రెడ్డి సర్కార్ నియమించిన విద్యాకమిషన్ సైతం రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 18-20శాతం నిధులు కేటాయించాలని సిఫార్సు చేసింది. దీనిని కూడా పాటించిన దాఖలాల్లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విద్యకు 7.75 శాతం నిధులు, 2026-27 బడ్జెట్లో 8.2 శాతం నిధులు మాత్రమే కేటాయించింది. కాంగ్రెస్ సగం పాలన ముగిసింది. మిగతా సగంలో బడ్జెట్ పెంచే అవకాశాల్లేనట్టే. ఎందుకంటే 23 స్కూళ్లను మూసివేసిన తర్వాత బడ్జెట్ కేటాయింపులుండవన్నది విద్యారంగ నిపుణుల వాదన.
సర్కార్ బడుల్లోని విద్యార్థుల ఆకలి తీర్చడం, విద్యార్థుల హాజరును పెంచడం, డ్రాపౌట్రేట్ను తగ్గించడం వంటి లక్ష్యాలతో గత కేసీఆర్ సర్కార్ ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకాన్ని ప్రారంభించింది. దశల వారీగా 3 వేలకు పైగా బడులకు ఈ పథకాన్ని విస్తరించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ పథకాన్ని నిలిపివేసింది. రెండున్నరేండ్ల తర్వాత ఈ విద్యాసంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పునః ప్రారంభించింది. ఈ పథకం 1,300కు పైగా బడులు, కాలేజీల్లోనే ప్రస్తుతం అమలవుతున్నది. ఇక మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు రూ.10వేల వేతనమిస్తామని కాంగ్రెస్ హామీనిచ్చింది. సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించగా, ఈ పనిని వంట కార్మికులకు కాకుండా ప్రైవేట్ ఎన్జీవోలకు అప్పగించింది.
రాష్ట్రంలో సర్కార్ బడుల రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ సర్కార్ చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ సర్కార్ విడుదల చేయలేదు. రూ.515.73 కోట్ల బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ మొత్తాన్ని విడుదల చేయాలని కాంట్రాక్టర్లు పలుమార్లు ధర్నాలకు దిగినా, సర్కార్ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇందులో రూ.5 లక్షల లోపు బిల్లుల విలువ రూ.141.76 కోట్లు ఉన్నది. రూ.కోటి లోపున్న బిల్లులు రూ. 305 కోట్లు. అప్పులు తెచ్చి పనులు చేశామని, వడ్డీలు కట్టలేకపోతున్నామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అయినా కాంగ్రెస్ సర్కార్ కనికరించడంలేదు.