అయిజ, జూన్ 21 : కర్ణాటక సర్కార్ ఆర్డీఎస్ ఆనకట్టకు 100 మీటర్ల ఎగువ న నిర్మిస్తున్న కురిడి తాగునీటి పథకంతో ఆర్డీఎస్ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారుతుందని గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ప్రతిపక్షపార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నవేళ కాంగ్రెస్ సర్కార్లో ఎట్టకేలకు చలనం వచ్చింది. కురిడిపై సమీక్షించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
కురిడిపై సమగ్రమైన సమాచారంతో సమీక్షకు హాజరుకావాలని జిల్లా ఇన్చార్జి ఎస్ఈ రహీముద్దీన్, ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారాంరెడ్డిలను సోమవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ నెల 17న, ‘ఆర్డీఎస్ నీటికి కర్ణాటక ఎసరు’ అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ వార్త ప్రచురించి కర్ణాటక చేపట్టిన కురిడి తాగునీటి పథకం కుట్రను బహిర్గతం చేసింది. కురిడి తాగునీటి పథకాన్ని నిలిపివేసేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకోవాలని అలంపూర్ నియోజకవర్గ ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.